Curtain: కేరళ మెడికల్ కాలేజీలో అమ్మాయిలకు, అబ్బాయిలకు మధ్య తెర... పలు సంఘాల ఆగ్రహం!

  • ఎల్జీబీటీ వర్గంపై ఇస్లామిక్ దృష్టికోణంపై క్లాసులు
  • క్లాసులు నిర్వహించిన ఓ ఇస్లామిక్ సంస్థ
  • మండిపడుతున్న విద్యార్థి, పౌర సంఘాలు
Curtain between boys and girl students in a Kerala medical college

కేరళలోని ఓ మెడికల్ కాలేజీలో క్లాస్ రూంలో అమ్మాయిలకు, అబ్బాయిలకు మధ్య తెర ఏర్పాటు చేయడం వివాదాస్పదం అయింది. త్రిసూర్ లోని ఆ వైద్య కళాశాలలో ఇస్లామిక్ దృష్టికోణంలో ఎల్జీబీటీక్యూఐఏ వర్గం (గే, లెస్బియన్, ట్రాన్స్ జెండర్) అనే అంశంపై తరగతులు నిర్వహించారు. ముజాహిద్ విజ్డమ్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ అనే ఇస్లామిక్ సంస్థ ఈ క్లాసులు ఏర్పాటు చేసింది. 

'ఎల్జీబీటీక్యూఐఏ: బిహైండ్ రెయిన్ బో ఫ్లాగ్స్... అండర్ స్టాండింగ్ ఎల్జీబీటీక్యూఐఏ ఫ్రం యాన్ ఇస్లామిక్ పర్ స్పెక్టివ్' పేరిట జరిపిన ఈ క్లాసుల్లో... అమ్మాయిలు ఓవైపు, అబ్బాయిలు ఓ వైపు కూర్చోగా, మధ్యలో ఓ కర్టెన్ ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించిన ఫొటోను సదరు ఇస్లామిక్ ఆర్గనైజేషన్ కు చెందిన సభ్యుడు సోషల్ మీడియాలో పంచుకోవడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. 

ఈ విషయంపై విద్యార్థి సంఘాలతో పాటు ఓ పౌర సంఘం కూడా భగ్గుమంది. కేరళ శాస్త్ర సాహిత్య పరిషత్, స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఎఫ్ఐ), వామపక్ష విద్యార్థి విభాగం ఈ చర్యను తీవ్రంగా ఖండించాయి. విద్యార్థుల మధ్య తెర ఎందుకని ఏ ఒక్కరూ ప్రశ్నించకపోవడం దారుణమని కేరళ శాస్త్ర సాహిత్య పరిషత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. 

అయితే, విమర్శలు వస్తున్నప్పటికీ ముజాహిద్ విజ్డమ్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ సంస్థ తమ చర్యను సమర్థించుకుంటోంది. తాము చేసిన దాంట్లో తప్పేమీ లేదని వాదిస్తోంది. కాగా, ఈ వ్యవహారంపై తాము పూర్తి సమాచారాన్ని పరిశీలించిన తర్వాత రంగంలోకి దిగుతామని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విద్యార్థి విభాగం కేరళ స్టూడెంట్స్ యూనియన్ (కేఎస్ యూ) అధ్యక్షుడు కేఎం అభిజిత్ వెల్లడించారు.

More Telugu News