Chinthamaneni Prabhakar: కోడిపందేలు ఆడటం నా వ్యసనం.. పటాన్ చెరు నుంచి సేఫ్ గా తప్పుకున్నా: చింతమనేని ప్రభాకర్

  • తాను కోడిపందేలు ఆడతాననే విషయం రెండు రాష్ట్రాల్లో తెలుసన్న చింతమనేని 
  • పందేల కోసం కర్ణాటకకు, పటాన్ చెరుకు వెళ్లానని వెల్లడి 
  • పోలీసులు వస్తున్నారని తెలియగానే అక్కడి నుంచి తప్పుకున్నానని వ్యాఖ్య 
Cock fights are my habit says Chinthamaneni

హైదరాబాద్ శివార్లలోని పటాన్ చెరులో జరిగిన కోడిపందేల్లో టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పాల్గొన్నారనే వార్త సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అక్కడి నుంచి చింతమనేని పారిపోయారని, ఆయన కోసం గాలిస్తున్నామని పటాన్ చెరు డీఎస్పీ చెప్పారు. ఈ క్రమంలో చింతమనేని స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

తాను కోడి పందేలు ఆడుతాననే విషయం రెండు రాష్ట్రాల ప్రజలకు, మీడియాకు, పోలీసులకు తెలుసని ఆయన చెప్పారు. తాను కోడిపందేలకు వెళ్లడం చాలా సాధారణమైన విషయమని... కోడిపందేలు ఆడటం తనకు ఒక వ్యసనమని అన్నారు. కోడిపందేల కోసం తాను కర్ణాటకకు, పటాన్ చెరుకు వెళ్లింది నిజమేనని చెప్పారు. అయితే కోడిపందేలు చట్టం దృష్టిలో నేరం కాబట్టి... పోలీసులు వస్తున్నారని సమాచారం అందగానే అక్కడి నుంచి క్షేమంగా తప్పుకున్నానని అన్నారు. 

చట్టాన్ని, న్యాయాన్ని గౌరవించాల్సిన బాధ్యత తనపై ఉన్నప్పటికీ... బలహీనతను చంపుకోలేక అక్కడకు వెళ్లానని చింతమనేని చెప్పారు. పోలీసులు వచ్చే సమయానికి తాను అక్కడ లేనని... అంతకు ముందు తీసిన ఫొటోలను, వీడియోలను మీడియాకు పోలీసులు లీక్ చేశారని అన్నారు. కోడిపందేలను నిర్వహిస్తూ తన కుటుంబాన్ని పోషించుకోవాల్సిన అవసరం తనకు లేదని చెప్పారు. 

కర్ణాటకలో కోడిపందేలకు వెళ్లి వస్తుండగా, భోజనానికి పిలిచారని... తనను ఇరికించడానికి ఇంత పెద్ద స్కెచ్ వేశారని చింతమనేని మండిపడ్డారు. అయితే తాను దొరకలేదని అన్నారు. ఈ కేసులో నిందితులకు 41ఏ నోటీసులు ఇవ్వాలని పోలీసులకు కోర్టు చివాట్లు పెట్టిందని చెప్పారు.

More Telugu News