కర్ణాటకలో కుండపోత వర్షాలు... విద్యాసంస్థలకు సెలవులు

07-07-2022 Thu 18:30
  • కర్ణాటక కోస్తా జిల్లాలకు అత్యంత భారీ వర్షసూచన
  • పరిస్థితి సమీక్షించిన సీఎం బసవరాజ్ బొమ్మై
  • అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు
  • మంగళూరులో కొండచరియలు విరిగిపడి ఇద్దరి మృతి
Huge rains lashes coastal Karnataka
కర్ణాటకలోని కోస్తా ప్రాంతాల్లో కుంభవృష్టి కారణంగా విద్యాసంస్థలు మూతపడ్డాయి. గత కొన్నిరోజులుగా నైరుతి రుతుపవనాల ప్రభావంతో కర్ణాటకలో కుండపోత వానలు కురుస్తున్నాయి. ఇప్పటికే చాలా ప్రాంతాలు నీట మునిగాయి. కొన్నిచోట్ల ఇళ్లు కూలిపోగా, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. కర్ణాటకలోని పలు ప్రధాన నదులు వరదనీటితో ఉప్పొంగుతున్నాయి. అటు, మంగళూరు జిల్లాలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో ఇద్దరు మరణించారు. 

ఈ క్రమంలో ఉత్తర కన్నడ, కొడగు, దక్షిణ కన్నడ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తాజా హెచ్చరికలు చేసింది. దాంతో, కర్ణాటక తీర ప్రాంత జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. ఐఎండీ ప్రకటన నేపథ్యంలో, సీఎం బసవరాజ్ బొమ్మై సమీక్ష నిర్వహించారు. ఆయా జిల్లాల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు.