రాజంపేట లోక్ స‌భ టీడీపీ అభ్య‌ర్థిని ప్ర‌క‌టించిన చంద్ర‌బాబు

07-07-2022 Thu 17:41
  • బెంగ‌ళూరు కేంద్రంగా పారిశ్రామిక‌వేత్త‌గా న‌ర‌హ‌రి
  • రాష్ట్రప‌తి నుంచి ఉత్తమ యువ పారిశ్రామికవేత్తగా అవార్డు
  • టీడీపీ మాజీ ఎమ్మెల్యే సోద‌రి అల్లుడే న‌ర‌హ‌రి
  • స‌త్య‌ప్ర‌భ మ‌ర‌ణంతో న‌ర‌హ‌రికి టికెట్ ప్ర‌క‌టించిన చంద్ర‌బాబు
chandrababu names ganta narahari for rajampeta loksabha candidate
2024 సార్వత్రిక ఎన్నిక‌ల‌కు సంబంధించి టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడు ఓ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. అన్న‌మ‌య్య జిల్లా మ‌ద‌న‌ప‌ల్లెలో బుధ‌వారం జ‌రిగిన మినీ మ‌హానాడుకు హాజ‌రైన ఆయ‌న ఆ త‌ర్వాత పీలేరులో పార్టీ నేత‌ల‌తో స‌మీక్షా స‌మావేశాన్ని నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా రాజంపేట లోక్ స‌భ స్థానం నుంచి గంటా న‌ర‌హ‌రి వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేస్తార‌ని చంద్ర‌బాబు ప్ర‌క‌టించారు. గంటా న‌ర‌హ‌రి గ‌త వారం చంద్ర‌బాబు స‌మ‌క్షంలోనే టీడీపీలో చేరారు.

రాజంపేట‌కే చెందిన గంటా న‌ర‌హ‌రి బెంగళూరు కేంద్రంగా వ్యాపార‌వేత్త‌గా రాణిస్తున్నారు. ఈ క్ర‌మంలో 2017-2018లో రాష్ట్రపతి నుంచి ఉత్తమ యువ పారిశ్రామికవేత్తగా అవార్డు అందుకున్నారు. గంటా న‌ర‌హ‌రి రాజ‌కీయాల‌కు కొత్తే అయినా... ఆయ‌న కుటుంబం మాత్రం చాలా కాలం రాజ‌కీయాల్లో కొన‌సాగుతున్న‌దే‌. 

దివంగ‌త ఎంపీ డీకే ఆదికేశ‌వులు నాయుడు భార్య దివంగ‌త స‌త్య‌ప్ర‌భ సోద‌రి కుమార్తెను న‌ర‌హ‌రి వివాహం చేసుకున్నారు. గ‌త ఎన్నికల్లో టీడీపీ అభ్య‌ర్థిగా పోటీ చేసిన స‌త్య‌ప్ర‌భ ఓట‌మి పాల‌య్యారు. ఆ త‌ర్వాత అనారోగ్య కార‌ణాల‌తో ఆమె మ‌ర‌ణించారు. ఈ క్ర‌మంలోనే న‌ర‌హ‌రికి ఆహ్వానం ప‌లికిన టీడీపీ... వ‌చ్చే ఎన్నిక‌ల్లో రాజంపేట లోక్ స‌భ స్థానం నుంచి త‌న అభ్య‌ర్థిగా ఆయనను ప్ర‌క‌టించింది.