భారీ వర్షాలు.. వరదనీటిలో చిక్కుకుపోయిన మహారాష్ట్ర సీఎం షిండే నివాసం!

07-07-2022 Thu 16:28
  • మహారాష్ట్రను ముంచెత్తుతున్న వర్షాలు
  • ముంబై, థానే ప్రాంతాల్లో కుంభవృష్టి
  • ఏక్ నాథ్ షిండే నివాసం చుట్టూ చేరిన వరదనీరు
CM Eknath Shinde residence surrounded by flood water
మహారాష్ట్రను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. రాజధాని ముంబై సహా థానే, పాల్ఘర్ తదితర జిల్లాలు కుంభవృష్టి వర్షాలతో అతలాకుతలం అవుతున్నాయి. నిన్న రాత్రి ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలతో థానేలోని సీఎం ఏక్ నాథ్ షిండే నివాసం వరదనీటిలో చిక్కుకుపోయింది. నివాసం చుట్టూ వరదనీరు చేరింది. వెంటనే అప్రమత్తమైన రెస్క్యూ టీమ్ అక్కడకు చేరుకుని వరదనీటిని తొలగించింది. 

మరోవైపు పూణె, సతారా, కొల్హాపూర్ జిల్లాల్లో మరో మూడు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరించింది. ఆయా జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఇంకోవైపు కర్ణాటకలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దక్షిణ కన్నడ జిల్లాలోని పంజికల్ ప్రాంతంలో కురిసిన వర్షాలకు కొండ చరియలు విరిగిపడ్డాయి. ఈ దుర్ఘటనలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. ఉడుపి, బెళగావి, దక్షిణ కన్నడ జిల్లాలకు భారీ వర్ష హెచ్చరికలను వాతావరణ శాఖ జారీ చేసింది.