కోహ్లీ మెడపై కత్తి... ఇంగ్లండ్ తో టీ20ల్లో రాణిస్తేనే వరల్డ్ కప్ చాన్స్!

07-07-2022 Thu 15:30
  • నేటి నుంచి ఇంగ్లండ్ తో టీ20 సిరీస్
  • ఇటీవల రీషెడ్యూల్డ్ టెస్టులో విఫలమైన కోహ్లీ
  • విండీస్ తో వన్డే సిరీస్ కు కోహ్లీకి విశ్రాంతినిచ్చిన సెలెక్టర్లు
  • కోహ్లీ భవిష్యత్ పై తీవ్ర అనిశ్చితి
Kohli career in critical position
టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ బ్యాటింగ్ వైఫల్యాలు కొనసాగుతున్నాయి. ఇటీవల ఇంగ్లండ్ తో బర్మింగ్ హామ్ లో జరిగిన రీషెడ్యూల్డ్ టెస్టు రెండు ఇన్నింగ్స్ ల్లోనూ కోహ్లీ రాణించింది లేదు. తొలి ఇన్నింగ్స్ లో 11, రెండో ఇన్నింగ్స్ లో 20 పరుగులు చేశాడు. ఇప్పుడు ఇంగ్లండ్ తో టీ20 సిరీస్ కు టీమిండియా సమాయత్తమవుతోంది. నేడు తొలి టీ20 మ్యాచ్ జరగనుంది. 

ఈ టీ20 సిరీస్ లో గనుక రాణించకపోతే కోహ్లీ విషయంలో సెలెక్టర్లు కఠిన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే కోహ్లీ చాలా అవకాశాలు వృథా చేశాడన్న భావన నెలకొని ఉంది. ఈ టీ20 సిరీస్ లో రాణించడంపైనే టీ20 వరల్డ్ కప్ కు కోహ్లీ ఎంపిక ఆధారపడి ఉంది. టీ20 వరల్డ్ కప్ ఈ ఏడాది అక్టోబరులో జరగనుంది. కోహ్లీ విషయంలో సెలెక్టర్లు ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. 

ఈ నెలలో వెస్టిండీస్ తో జరిగే మూడు వన్డేల సిరీస్ కు శిఖర్ ధావన్ నాయకత్వంలో సెలెక్టర్లు జట్టును ప్రకటించారు. రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా, రిషబ్ పంత్, జస్ప్రీత్ బుమ్రాలతో పాటు కోహ్లీకి విశ్రాంతి కల్పించారు. అయితే, వన్డే సిరీస్ అనంతరం జరిగే ఐదు మ్యాచ్ ల టీ20 సిరీస్ కోసం రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా, పంత్ జట్టుతోనే కరీబియన్ దీవులకు వెళ్లనున్నట్టు తెలుస్తోంది. కానీ కోహ్లీ వెస్టిండీస్ తో టీ20 సిరీస్ కు ఎంపికవుతాడా? అనే విషయంలో అనిశ్చితి నెలకొంది. 

అతడిని వెస్టిండీస్ తో టీ20 సిరీస్ కు ఎంపిక చేయాలన్నా, ఆపై వరల్డ్ కప్ కు పరిగణనలోకి తీసుకోవాలన్నా... ఇప్పుడు ఇంగ్లండ్ తో జరిగే తొలి రెండు టీ20లు, తదుపరి వన్డే సిరీస్ లో రాణించడం అత్యావశ్యకంగా కనిపిస్తోంది. ఏదేమైనా కోహ్లీ భవిష్యత్తు మరికొన్ని వారాల్లో తేలిపోనుంది. ఇప్పటికే టీమిండియాలో చోటు కోసం పోటీ ఉద్ధృతంగా ఉంది. వెంకటేశ్ అయ్యర్, రుతురాజ్ గైక్వాడ్, సంజు శాంసన్, దీపక్ హుడా వంటి ప్రతిభావంతులు వరుసలో ఉన్నారు. ఈ నేపథ్యంలో, జట్టులో చోటు కోసం కోహ్లీ ఏం చేస్తాడో చూడాలి.