టీపీసీసీ చీఫ్‌గా ఏడాది పూర్తి చేసుకున్న రేవంత్ రెడ్డి... 4 ఫొటోలతో ఆస‌క్తిక‌ర‌ ట్వీట్

07-07-2022 Thu 15:17
  • సోనియా, రాహుల్‌, ప్రియాంక‌ల‌తో క‌లిసి ఉన్న ఫొటోల‌ను జ‌త చేసిన రేవంత్‌
  • టీపీసీసీ చీఫ్‌గా ప‌ద‌వీ బాధ్య‌త‌లు స్వీక‌రిస్తున్న ఫొటోనూ యాడ్ చేసిన ఎంపీ
  • కాంగ్రెస్ నేత‌ల నుంచి రేవంత్‌కు అభినంద‌న‌ల వెల్లువ‌
revanth reddy completes one year as tpcc president
మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ (టీపీసీసీ) అధ్య‌క్షుడిగా గురువారం ఏడాది పూర్తి చేసుకున్నారు. ఈ సంద‌ర్భాన్ని పుర‌స్క‌రించుకుని ఆయ‌న త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో ఓ ఆస‌క్తిక‌ర ట్వీట్‌ను పోస్ట్ చేశారు. కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షురాలు సోనియా గాంధీ, పార్టీ అగ్ర నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ వాద్రాల‌తో క‌లిసి ఉన్న ఫొటోల‌తో పాటు టీపీసీసీ అధ్య‌క్షుడిగా తాను ప‌ద‌వీ బాధ్య‌త‌లు తీసుకుంటున్న ఫొటోను స‌ద‌రు ట్వీట్‌కు జ‌త చేశారు. 

త‌న‌పై న‌మ్మకం ఉంచి పార్టీ అధి నాయ‌క‌త్వం కీల‌క బాధ్య‌త‌లు అప్ప‌గించింద‌ని ఈ సంద‌ర్భంగా రేవంత్ పేర్కొన్నారు. ఈ ట్వీట్‌ను చూసిన పార్టీ సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి గీతారెడ్డి ఆయ‌న‌ను అభినందిస్తూ ఓ ట్వీట్ చేశారు. పార్టీకి చెందిన ఇత‌ర నేత‌ల నుంచి కూడా రేవంత్ రెడ్డికి అభినంద‌న‌లు వెల్లువెత్తుతున్నాయి.