సఫ్రాన్ కంపెనీని హైదరాబాదుకు తీసుకురావడానికి కేటీఆర్ పడిన కష్టాన్ని వివరించిన జ‌యేశ్ రంజ‌న్‌

07-07-2022 Thu 14:55
  • హైద‌రాబాద్‌లో స‌ఫ్రాన్ యూనిట్‌ను ప్రారంభించిన కేటీఆర్‌
  • స‌ఫ్రాన్ కంపెనీతో కేటీఆర్ 35 స‌మావేశాలు నిర్వ‌హించార‌న్న జ‌యేశ్ రంజ‌న్‌
  • 4 ఏళ్లుగా శ్ర‌మించిన కేటీఆర్ స‌ఫ్రాన్‌ను ర‌ప్పించార‌ని వెల్ల‌డి
ktr ianugurates safran unit in hyderabad
విమానాల మెయింటెనెన్స్‌, రిపేరీ రంగంలో అగ్ర‌గామిగా ఎదిగిన స‌ఫ్రాన్ కంపెనీ యూనిట్‌ను గురువారం హైద‌రాబాద్‌లో తెలంగాణ ప‌రిశ్ర‌మ‌లు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ లాంఛ‌నంగా ప్రారంభించారు. ఈ యూనిట్ స‌ఫ్రాన్‌కు చెందిన అన్ని యూనిట్ల‌లోకి అతి పెద్ద‌దిగా నిలిచిన సంగ‌తి తెలిసిందే. ఇక ఈ కంపెనీని హైద‌రాబాద్ తీసుకురావ‌డానికి కేటీఆర్ ఎంత‌గానో శ్ర‌మించారు. ఈ విష‌యాన్ని తెలంగాణ ప‌రిశ్ర‌మ‌లు, ఐటీ శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి హోదాలో నిత్యం కేటీఆర్ వెన్నంటే సాగిన సీనియ‌ర్ ఐఏఎస్ అధికారి జ‌యేశ్ రంజ‌న్‌ సోష‌ల్ మీడియా వేదిక‌గా వెల్ల‌డించారు. 
స‌ఫ్రాన్ త‌న యూనిట్‌ను హైద‌రాబాద్‌లో ఏర్పాటు చేసే దిశ‌గా ఆ కంపెనీతో కేటీఆర్ 35 సార్లు భేటీ అయ్యార‌ని రంజ‌న్ తెలిపారు. హైద‌రాబాద్‌తో పాటు ఢిల్లీ, పారిస్‌ల‌లో జ‌రిగిన ఈ భేటీల్లో తెలంగాణ త‌ర‌ఫున కేటీఆర్ పాల్లొన‌గా... ఆయ‌న వెంట రంజ‌న్ కూడా పాలుపంచుకున్నారు. నాలుగేళ్ల నాడు ఈ భేటీల‌ను కేటీఆర్ మొద‌లుపెట్టార‌ని కూడా రంజ‌న్ తెలిపారు. ఇక భేటీల త‌ర్వాత ఆయా అంశాల‌పై ఇటు తెలంగాణ ప్ర‌భుత్వం, అటు స‌ఫ్రాన్ కంపెనీల మ‌ధ్య ఏకంగా 400ల‌కు పైగా ఈ మెయిళ్ల‌ను ప‌రస్ప‌రం పంచుకున్నార‌ట‌. ఇంత‌టి క‌ఠోర శ్ర‌మ‌తోనే స‌ఫ్రాన్ కంపెనీని కేటీఆర్ హైద‌రాబాద్‌కు తీసుకురాగ‌లిగార‌ని రంజ‌న్ తెలిపారు.