మోదీ తీసుకున్న గొప్ప నిర్ణయాన్ని మనసారా స్వాగతిస్తున్నా: రాజ్యసభ పదవులపై పవన్ కల్యాణ్ స్పందన

07-07-2022 Thu 14:35
  • ఇళయరాజా, విజయేంద్రప్రసాద్ లకు రాజ్యసభ చాన్స్
  • వీరేంద్ర హెగ్డే, పీటీ ఉష కూడా నామినేట్
  • వీరి సేవలు మోదీ గుర్తించారన్న పవన్
  • సముచిత నిర్ణయం తీసుకున్నారని కితాబు
Pawan Kalyan appreciated Modi and Union govt
సినీ కథా రచయిత విజయేంద్రప్రసాద్, మ్యాస్ట్రో ఇళయరాజా, పరుగులరాణి పీటీ ఉష, ధర్మస్థల ఆలయ ధర్మాధికారి, ప్రముఖ సామాజికవేత్త వీరేంద్ర హెగ్డేలను రాష్ట్రపతి రాజ్యసభకు నామినేట్ చేయడం తెలిసిందే. దీనిపై జనసేన పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్ స్పందించారు. 

ఎవరికైనా పదవులు ఇవ్వాలంటే రాజకీయంగా ఎంత మేర లబ్ది కలుగుతుంది? ఎన్ని కోట్లు మన ఇంట్లో వచ్చి చేరతాయి? అని కొన్ని పార్టీల అధినేతలు లెక్కలు వేసుకుని ముక్కు ముఖం తెలియని వారికి పెద్ద పదవులు కట్టబెట్టడం జగమెరిగిన సత్యం అని పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. ఇలాంటివేళ ప్రధాని నరేంద్ర మోదీ గొప్ప నిర్ణయం తీసుకున్నారని కొనియాడారు. ఇళయరాజా, విజయేంద్రప్రసాద్, వీరేంద్ర హెగ్డే, పీటీ ఉష రాజ్యసభ సభ్యులుగా నియమితులయ్యారనే వార్త ఎంతో ఆనందాన్ని కలిగించిందని, ప్రధాని మోదీ నిర్ణయాన్ని మనసారా స్వాగతిస్తున్నానని తెలిపారు. 

రాజ్యసభకు నామినేట్ అయిన ఇళయరాజా, విజయేంద్రప్రసాద్, వీరేంద్ర హెగ్డే, పీటీ ఉష తమ రంగాల్లో దేశ ప్రతిష్ఠను ఇనుమడింపజేసే స్రష్టలు అని పవన్ కల్యాణ్ కీర్తించారు. వీరి సేవలు, అనుభవాన్ని గుర్తించిన ప్రధాని మోదీకి, కేంద్ర ప్రభుత్వానికి అభినందనలు తెలియజేస్తున్నానని వెల్లడించారు.