నీచమైన ప్రచారాలు చేస్తున్నారు.. ఇంత రాక్షస రాజకీయం అవసరమా?: చింతమనేని

07-07-2022 Thu 13:41
  • పటాన్ చెరులో కోడి పందేల వ్యవహారం
  • చింతమనేని హస్తం ఉందంటూ వార్తలు
  • మీ రాక్షస రాజకీయాలకు ముగింపు పలికే రోజు దగ్గర్లోనే ఉందన్న చింతమనేని
Chinthamaneni Prabhakar fires on YSRCP in cock fight issue
హైదరాబాద్ శివార్లలోని పటాన్ చెరులో జరిగిన కోడి పందేల్లో టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ హస్తం ఉందనే వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చింతమనేని స్పందిస్తూ... రాజకీయాలను రాజకీయంగానే ఎదుర్కోవాలని అన్నారు. కోడి పందేల్లో లేని వ్యక్తిని అక్కడ ఉన్నట్టు చూపించడం కొందరి రాజకీయ జెండా, అజెండా అని విమర్శించారు. 

నీచమైన ప్రచారాలు చేస్తూ, కుప్పకూలిపోయే మేడలు కట్టి అధికారంలోకి వచ్చారని దుయ్యబట్టారు. ఆ మేడలు కూలిపోయే సమయం ఆసన్నమయిందని అన్నారు. అసత్యాల 'సాక్షి'ని ప్రక్షాళన చేసే సమయం ఆసన్నమయిందని చెప్పారు. ఇంతటి రాక్షస రాజకీయం అవసరమా? అని ప్రశ్నించారు. మీ రాక్షస రాజకీయాలకు ముగింపు పలికే రోజు దగ్గర్లోనే ఉందని చెప్పారు.