సింగపూర్ లో మాదకద్రవ్యాల సరఫరా కేసులో.. భారత సంతతి వ్యక్తి సహా ఇద్దరికి మరణశిక్ష అమలు

07-07-2022 Thu 12:30
  • భారత సంతతికి చెందిన కల్వంత్ సింగ్ దోషిగా నిర్ధారణ
  • చివరి అభ్యర్థనను తోసిపుచ్చిన స్థానిక కోర్టు
  • సింగపూర్ జాతీయుడికి సైతం ఇదే శిక్ష
  • ఖండించిన ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్
Singapore executes 2 including Indian origin man for drugs trafficking
మరణశిక్ష ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో అమల్లో ఉంది. దీన్ని హక్కుల సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తుంటాయి. ప్రాణం ఆడక గిలగిలా కొట్టుకుంటూ ఊపిరి ఆగిపోయే ఈ శిక్ష చాలా క్రూరమైనదిగా వాటి అభ్యంతరం.  

సింగపూర్ లో తాజాగా ఇద్దరికి మరణశిక్ష అమలు చేశారు. మాదకద్రవ్యాల సరఫరా కేసులో దోషులుగా తేలడంతో భారత సంతతికి చెందిన మలేషియన్ కల్వంత్ సింగ్ (32), సింగపూర్ దేశీయుడైన నోరాషరీ గౌస్ (48)ను గురువారం ఉరి తీశారు. కల్వంత్ సింగ్ పెట్టుకున్న తుది అభ్యర్థనను సైతం అక్కడి కోర్టు కొట్టివేసింది. 

గడిచిన మూడు నెలల్లో సింగపూర్ లో ఉరిశిక్షకు గురైన భారత సంతతి రెండో వ్యక్తి కల్వంత్ సింగ్ కావడం గమనార్హం. ఈ ఏడాది ఏప్రిల్ లోనూ భారత సంతతికి చెందిన ధర్మలింగం అనే వ్యక్తిని కూడా డ్రగ్స్ రవాణాలో నేరం నిరూపణ కావడంతో సింగపూర్ లో ఉరితీశారు. సింగపూర్ లో డ్రగ్స్ కు వ్యతిరేకంగా కఠిన చట్టాలు అమల్లో ఉన్నాయి. అక్కడ శిక్షణలను చాలా కఠినంగా అమలు చేస్తారు. అందుకే నేరాలు తక్కువ. 

సింగపూర్ మరోసారి అంతర్జాతీయ చట్టాలకు వ్యతిరేకంగా ఉరిశిక్ష అమలు చేసినట్టు ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ డిప్యూటీ రీజినల్ డైరక్టర్ ఎమెర్లిన్నే గిల్ పేర్కొన్నారు. మరణశిక్ష అన్నది పరిష్కారం కాదని, దీన్ని నిర్ద్వంద్వంగా ఖండిస్తున్నట్టు చెప్పారు.