నీక్కూడా సిద్ధూ మూసేవాలాకు పట్టిన గతే.. బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ లాయర్‌కు బెదిరింపులు

07-07-2022 Thu 10:03
  • సల్మాన్‌ఖాన్‌ను చంపేస్తామంటూ ఇటీవల బెదిరింపులు
  • హస్తిమల్‌ను లేఖ ద్వారా బెదిరించిన వైనం
  • భద్రత కల్పించిన పోలీసులు
Salman Khans Lawyer Receives Death Threat
బాలీవుడ్ అగ్రనటుడు సల్మాన్‌ఖాన్‌ను చంపేస్తామని బెదిరింపులు వచ్చిన కొన్ని రోజులకే ఆయన లాయర్‌కు కూడా అలాంటి బెదిరింపులే వచ్చాయి. కృష్ణ జింకల వేట కేసులో సల్మాన్ తరపున వాదిస్తున్న లాయర్లలో ఒకరైన హస్తిమల్ సరస్వత్‌ను ఓ లేఖ ద్వారా దుండగులు హెచ్చరించారు. పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలకు పట్టిన గతే నీక్కూడా పడుతుందంటూ ఆ లేఖలో హస్తిమల్‌కు హెచ్చరికలు జారీ చేశారు.

కోర్టులోని ఆయన చాంబర్ బయట ఈ లేఖ కనిపించింది. దీనిపై మూసేవాలా హత్యకేసు నిందితులైన లారెన్స్ బిష్ణోయ్, గోల్డీ బ్రార్ పేర్లలోని మొదటి అక్షరాలు ఉన్నాయి. బెదిరింపు లేఖ నేపథ్యంలో సల్మాన్ ఖాన్ లాయర్‌కు భద్రత కల్పించినట్టు ఈస్ట్ జోధ్‌పూర్ అదనపు డిప్యూటీ కమిషనర్ నజీమ్ అలీ తెలిపారు. లేఖ ఘటనపై దర్యాప్తు ప్రారంభించినట్టు చెప్పారు.