IMD: మహారాష్ట్రలో రెడ్ అలెర్ట్ జారీ.. తెలంగాణ, ఒడిశాలలో కూడా అతి భారీ వర్షాలు: ఐడీఎం హెచ్చరిక

IMD issues Red Alert to Maharashtra and expected heavy rains in telangana and Odisha
  • మహారాష్ట్రలో వచ్చే మూడు రోజులు అతి భారీ వర్షాలు కురుస్తాయన్న ఐఎండీ
  • ఇప్పటికే మహారాష్ట్రను ముంచెత్తుతున్న వానలు
  • ప్రమాదకరంగా పంచగంగ నది
  • ఒడిశా, తెలంగాణకు అతి భారీ వర్ష సూచన

మహారాష్ట్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ భారత వాతావరణ శాఖ (IMD) రెడ్ అలెర్ట్ జారీ చేసింది. పూణె, సతారా, కొల్హాపూర్ జిల్లాల్లో వచ్చే మూడు రోజులు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. అలాగే, కొల్హాపూర్‌లోని పంచగంగనది పొంగిపొర్లుతోంది. నీటిమట్టం హెచ్చరిక మార్కుకు ఏడు అడుగుల వరకు చేరుకోవడంతో ప్రజలు భయపడుతున్నారు. వర్షాలు ఇలాగే పడితే నేడే అది వార్నింగ్ మార్క్ అయిన 39 అడుగులకు చేరుకుంటుందని అధికారులు చెబుతున్నారు.  

రాష్ట్రంలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న ఐఎండీ హెచ్చరికల నేపథ్యంలో జాతీయ విపత్తు స్పందన దళం (NDRF) 17 బృందాలను ముంబై, థానే తదితర ప్రాంతాల్లో మోహరించారు. అలాగే, సతారా జిల్లాలోని ప్రతాప్‌గఢ్ కోట సమీపంలో కొండచరియలు కూడా విరిగిపడినట్టు తెలుస్తోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ముంబై సహా రాష్ట్రంలోని పలు ప్రాంతాలు నీటమునిగాయి.

వచ్చే ఐదు రోజుల్లో ఒడిశాలోని 17 జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. గంజాం జిల్లాలో గత 24 గంటల్లో అత్యధికంగా 130.4 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. అలాగే, తెలంగాణలోనూ అతి భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. ముఖ్యంగా జోగులాంబ గద్వాల్, వనపర్తి, నాగర్‌కర్నూలు, నల్గొండ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు.

  • Loading...

More Telugu News