Jammu And Kashmir: బతిమాలిన తల్లిదండ్రులు.. లొంగిపోయిన ఉగ్రవాదులు

  • కుల్గాంలో భద్రతా దళాల యాంటీ టెర్రర్ ఆపరేషన్
  • ఓ ఇంట్లో నక్కిన ఇద్దరు ఉగ్రవాదులు
  • తల్లిదండ్రులను పిలిపించి లొంగిపొమ్మని కోరిన పోలీసులు
  • ఇద్దరి ప్రాణాలు కాపాడామన్న ఐజీపీ
Two militants surrender during encounter in Kulgam

కరుడుగట్టిన ఉగ్రవాదులను తల్లి ప్రేమ కరిగిస్తుందని చెప్పేందుకు ఇది ఓ ఉదాహరణ. తల్లిదండ్రుల విజ్ఞప్తితో ఇద్దరు ఉగ్రవాదులు భద్రతా దళాలకు లొంగిపోయారు. జమ్మూకశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలో జరిగిందీ ఘటన. యాంటీ టెర్రర్ ఆపరేషన్‌ నిర్వహించిన భద్రతా దళాలు ఓ ఇంట్లో ఇద్దరు ఉగ్రవాదులు నక్కి ఉన్నట్టు గుర్తించారు. విషయాన్ని వెంటనే వారి తల్లిదండ్రులకు చేరవేశారు. వారు వెంటనే అక్కడకు చేరుకుని లొంగిపోవాలని కుమారులను అభ్యర్థించారు. 

వారి అభ్యర్థనకు కరిగిపోయిన ఉగ్రవాదులు బయటకు వచ్చి పోలీసుల ఎదుట లొంగిపోయారు. వారి నుంచి ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. యువకులిద్దరూ ఇటీవలే ఉగ్రవాద సంస్థలో చేరినట్టు పోలీసులు తెలిపారు. ఎన్‌కౌంటర్ చేయకుండా ఇద్దరి ప్రాణాలను కాపాడినట్టు రాష్ట్ర ఐజీపీ విజయ్ కుమార్ తెలిపారు. ఉగ్రవాదం వైపు వెళ్లొద్దని, హింసా మార్గానికి దూరంగా ఉండాలని తల్లిదండ్రులు తమ పిల్లలకు సూచించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. వారు సహకరిస్తే మరెంతోమంది ప్రాణాలను కాపాడవచ్చన్నారు.

More Telugu News