చెదిరిన సానియా మీర్జా క‌ల‌.. వింబుల్డ‌న్ లో ఓట‌మి

07-07-2022 Thu 08:17
  • మిక్స్‌డ్ డబుల్స్ సెమీఫైన‌ల్లో ఓడిపోయిన సానియా జోడీ
  • తొలి సెట్ గెలిచినా ఆధిక్యాన్ని కాపాడుకోలేక పోయిన భార‌త ప్లేయ‌ర్‌
  • వింబుల్డ‌న్ మిక్స్ డ్ టైటిల్ వేట‌లో మ‌రోసారి నిరాశే
 Heartbreak for Sania Mirza and Mate Pavic as they lose mixed doubles semis in Wimbledon 2022
భార‌త టెన్నిస్ దిగ్గ‌జం సానియా మీర్జా క‌ల చెదిరింది. ప్ర‌తిష్ఠాత్మ‌క వింబుల్డ‌న్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ చాంపియ‌న్ షిప్‌లో మిక్స్ డ్ డబుల్స్ లో విజేత‌గా నిల‌వాల‌న్న ఆమె కోరిక నెర‌వేర‌లేదు. క్రొయేషియాకు చెందిన త‌న‌ భాగ‌స్వామి మేటే ప‌విచ్ తో క‌లిసి అద్భుత ఆట‌తో సెమీపైన‌ల్‌కు దూసుకొచ్చిన సానియా ఫైన‌ల్ చేరుకోలేక‌పోయింది. బుధ‌వారం అర్ధ‌రాత్రి జ‌రిగిన సెమీఫైన‌ల్లో సానియా- ప‌విచ్ జంట 6-4, 5-7, 4-6 తేడాతో ఇంగ్లండ్‌, అమెరికా ద్వ‌యం నీల్ స్కూప్‌ స్కీ- క్రావ్ జిక్ జంట చేతిలో పరాజయం పాలైంది. 

ఈ మ్యాచ్‌లో తొలి సెట్‌ను సులువుగా నెగ్గిన సానియా-ప‌విచ్ ద్వ‌యం రెండో సెట్ లో 2-0తో ఆధిక్యం సాధించి సులభంగా మ్యాచ్ గెలిచేలా క‌నిపించింది. కానీ, గొప్ప‌గా పుంజుకున్న ప్ర‌త్య‌ర్థి జంట రెండో సెట్ తో పాటు మూడో సెట్ కూడా నెగ్గి సానియా-ప‌విచ్ ద్వయాన్ని ఓడించింది. దాంతో సానియా పోరాటం సెమీఫైన‌ల్లోనే ముగిసింది.

వింబుల్డ‌న్ మిక్స్ డ్ డ‌బుల్స్‌లో సానియా సెమీఫైన‌ల్ వ‌ర‌కు రావ‌డం ఇదే తొలిసారి.  ఆస్ట్రేలియ‌న్ ఓపెన్‌, ఫ్రెంచ్ ఓపెన్‌, యూఎస్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ టోర్న‌మెంట్ల‌లో సానియా మిక్స్ డ్ డ‌బుల్స్‌లో విజేత‌గా నిలిచింది. ఒక్క వింబుల్డ‌న్ మిక్స్ డ్ టైటిల్ మాత్ర‌మే ఆమెకు ఇప్ప‌టిదాకా అంద‌లేదు.