Africa: నైజీరియాలో జైలుపై జిహాదీల దాడి.. 879 మంది ఖైదీల పరారీ

Jihadis attack jail in Nigerias capital and 879 inmates escape
  • రాజధాని అబుజాలోని కుజై జైలుపై దాడి
  • పరారైన వారిలో కొందరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
  • పరారీలో ఇంకా 443 మంది ఖైదీలు
  • బోకో హరామ్ ఉగ్రవాద సంస్థ పనేనన్న ప్రభుత్వం
ఆఫ్రికా దేశమైన నైజీరియాలో ఓ జైలుపై జిహాదీలు విరుచుకుపడ్డారు. రాజధాని అబుజాలోని కుజె జైలుపై దాడి చేసిన ఇస్లామిక్ తీవ్రవాద తిరుగుబాటుదారులు పేలుడు పదార్థాలతో విరుచుకుపడ్డారు. ఒక గార్డును చంపేసి ఖైదీలను విడిపించుకుపోయారు. ఈ ఘటన తర్వాత 879 మంది ఖైదీలు పరారయ్యారు. 

అయితే, వెంటనే అప్రమత్తమైన అధికారులు తప్పించుకున్న వారిలో కొందరిని మళ్లీ పట్టుకున్నారు. ఇంకా 443 మంది ఖైదీలు పరారీలో ఉన్నట్టు నైజీరియన్ కరెక్షనల్ సర్వీస్ అధికార ప్రతినిధి ఉమర్ అబుబకర్ తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే జైలుకు చేరుకున్న నైజీరియా అధ్యక్షుడు ముహమ్మద్ బుహారి విచారం వ్యక్తం చేశారు. నైజీరియా ఇంటెలిజెన్స్ వ్యవస్థ తనను తీవ్ర అసంతృప్తికి గురిచేసిందన్నారు.

పేలుడు పదార్థాలు ఉపయోగించి జైలు గోడకు రంధ్రం చేసిన ఉగ్రవాదులు జైలులోకి ప్రవేశించి కాల్పులు, పేలుళ్లతో బీభత్సం సృష్టించారు. నిజానికి నైజీరియాలో జైళ్లపై దాడులు కొత్తేమీ కాదు. దశాబ్దాలుగా జరుగుతున్నదే. జైళ్లలో ఉన్న తమవారిని విడిపించుకోవడం కోసం తరచూ వారు దాడులకు తెగబడుతుంటారని అధికారులు తెలిపారు. బోకో హరామ్ సంస్థకు చెందిన వారే ఈ దాడికి తెగబడ్డారని అంతర్గత మంత్రిత్వశాఖ తెలిపింది.

కాగా, కుజే జైలులో దాదాపు 1000 మంది ఖైదీలు ఉన్నారని, వారిలో 64 మంది బోకో హరామ్ ఉగ్రవాద సంస్థకు చెందిన వారేనని ఆ దేశ రక్షణ మంత్రి మేజర్ జనరల్ బషీర్ సలిహి మగషి తెలిపారు.
Africa
Nigeria
Abuja
Muhammadu Buhari
Jail Break

More Telugu News