జగన్​ దోచుకున్న ప్రతి రూపాయిని ప్రజలే కక్కిస్తారు: యనమల

06-07-2022 Wed 15:36
  • ఏపీ ప్రభుత్వం అవార్డుల పేరుతో వలంటీర్లకు కోట్లు దోచిపెడుతోందన్న యనమల 
  • సొంత పత్రికకు వందల కోట్ల ప్రజా ధనాన్ని ఇచ్చుకున్నారని ఆరోపణ 
  • ఇప్పుడు మళ్లీ డబ్బును సొంత ఖజానాకు మళ్లించుకుంటున్నారని విమర్శలు 
yanamala comments on cm jagan
ఆంధ్రప్రదేశ్ లో జగన్ ప్రభుత్వం ప్రజా ధనాన్ని దోచుకుంటోందని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు మండిపడ్డారు. దీనంతటినీ త్వరలో ప్రజలే తిరిగి కక్కిస్తారని పేర్కొన్నారు. జగన్ ప్రభుత్వం ఇప్పటికే తమ సొంత పత్రికకు రూ.280 కోట్ల ప్రజాధనాన్ని మళ్లించుకున్నారని.. అవార్డుల పేరుతో సచివాలయాల వలంటీర్లకు రూ.485.44 కోట్లను దోచి పెడుతోందని ఆరోపించారు.

సొంత ఖజానాకు లాక్కునే ఉద్దేశం
‘‘ఇప్పుడు సచివాలయాల్లో వలంటీర్లు వార్తా పత్రికలు కొనుక్కోవడం కోసమని జగన్ ప్రభుత్వం నిధులు ఇస్తోంది. నెలకు రూ. 200 చొప్పున చెల్లించేందుకు ఆదేశాలు జారీ చేసింది. సచివాలయాలకు వార్తా పత్రికల కోసమని రూ.5.50 కోట్లను ఖర్చు చేస్తోంది. ఈ సొమ్మంతా జగన్ సొంత పత్రికను కొనుగోలు చేసేందుకే ఖర్చు పెట్టి.. సొంత ఖజానాకు లాక్కునే ఉద్దేశమే. ముఖ్యమంత్రి జగన్ తన సొంత పత్రికను పార్టీ కార్యకర్తలకు ఉచితంగా ఇవ్వలేరా..?” అని యనమల రామకృష్ణుడు ప్రశ్నించారు. జగన్ ప్రభుత్వం దోచుకున్న ప్రజా ధనాన్ని కక్కించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు.