Dinosaur: వేలానికి గొర్గోసారస్​​ అస్థిపంజరం.. ఈ భయంకర డైనోసార్​ రేటెంతో తెలుసా?

76 million year old gorgosaurus skeleton to be auctioned on july 28
  • తొలినాటి డైనోసార్లలో ప్రధానమైనది గొర్గోసారస్ 
  • అస్థి పంజరాన్ని వేలానికి పెట్టిన సోత్ బీ వేలం శాల
  • ఈ నెల 28వ తేదీన బహిరంగ వేలం.. 
  • రూ.40 కోట్ల నుంచి రూ.65 కోట్ల వరకు పలకవచ్చని అంచనా
  • ఎముకలను ఒకచేట చేర్చి పూర్తి రూపాన్ని సిద్ధం చేసిన నిపుణులు
కోట్ల ఏళ్ల కిందట భూమిని ఏలిన డైనోసార్లు అంటే అందరికీ ఆసక్తి ఎక్కువే. మరి ఏకంగా ఓ డైనోసార్ అస్థి పంజరాన్ని ఇంట్లో తెచ్చి పెట్టుకునే అవకాశం చిక్కితే.. భలే బాగుంటుంది కదా! ప్రఖ్యాత సోత్ బీ వేలం శాల ఈ చాన్స్ ఇస్తోంది. తొలినాటి డైనోసార్లలో భయంకరమైన గొర్గోసారస్ అస్థి పంజరాన్ని ఈ నెల 28న వేలం వేసేందుకు రంగం సిద్ధం చేసింది. 

పది అడుగుల ఎత్తు, 22 అడుగుల పొడవుతో ఉన్న ఈ అస్థి పంజరం 7.6 కోట్ల ఏళ్ల కిందటిదిగా నిర్ధారించారు. డైనోసార్లలో అత్యంత భయంకరమైన టైరనోసారస్ కంటే ఇది ముందే జీవించినట్టు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆసక్తి ఉన్నవారు ఎవరైనా ఆ వేలంలో పాల్గొని అస్థి పంజరాన్ని కొనుక్కోవచ్చంటూ సోత్ బీ వేలం శాల ట్విట్టర్ లో ట్వీట్ చేసింది.

జులై 21 నుంచి ప్రదర్శనకు..
‘‘ఇప్పటివరకు ఎన్నో రకాల అస్థి పంజరాలు ప్రైవేటు వ్యక్తుల చేతిలో ఉన్నా.. గొర్గోసారస్ ఇలా వేలానికి రానుండటం ఇదే మొదటి సారి. పది అడుగుల ఎత్తు, 22 అడుగుల పొడవు ఉన్న ఈ డైనోసార్ అస్థి పంజరాన్ని న్యూయార్క్ లోని సోత్ బీ వేలం శాలలో జులై 21 నుంచి బహిరంగ ప్రదర్శనకు పెడుతున్నాం. జులై 28న వేలం వేస్తాం” అని సోత్ బీ సంస్థ ట్విట్టర్ లో ప్రకటించింది.

2018లో గుర్తించి..
తొలితరం డైనోసార్లు తిరుగాడిన క్రేటాషియస్ కాలానికి చెందిన మాంసాహార డైనోసార్లలో గొర్గోసారస్ ఒకటి. అమెరికా, కెనడా ప్రాంతాల్లో ఇది ఉండేదని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ అస్థి పంజరాన్ని 2018లో అమెరికాలోని మోంటానాలో జుడిత్ నది సమీపంలో గుర్తించినట్టు వెల్లడించారు.

Dinosaur
Auction
Old Dinosaur
offbeat
Newyork

More Telugu News