మేకప్ తో బోల్తా కొట్టిస్తూ మూడు పెళ్లిళ్లు చేసుకున్న మధ్య వయస్కురాలు

05-07-2022 Tue 21:49
  • తిరుపతికి చెందిన శరణ్య వయసు 54 ఏళ్లు
  • 30 ఏళ్ల మహిళగా నమ్మిస్తూ వివాహాలు
  • తమిళనాడుకు చెందిన గణేశ్ తో మూడో వివాహం
  • ఆధార్ కార్డుతో అమ్మడి అసలు వయసు బట్టబయలు
Middle age woman married three people
ఆమె పేరు శరణ్య. వయసు 54 సంవత్సరాలు. వయసు కాస్త తక్కువగా కనిపించేందుకు మేకప్ వేసుకుంటుంది. మేకప్ వేసుకోవడం తప్పేమీ కాదు కానీ, మేకప్ తో పడుచు పిల్లలా కనిపిస్తూ మూడు పెళ్లిళ్లు చేసుకుని నిత్యపెళ్లికూతురు అవతారం ఎత్తింది. మూడో భర్త పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆ మధ్యవయస్కురాలి మోసాల చిట్టా బయటికి వచ్చింది. 

ఆమె పేరు శరణ్య. తిరుపతిలో తన తల్లి శాంతమ్మతో కలిసి ఉంటోంది. వయసు 50 ఏళ్లు దాటడంతో మేకప్ వేసుకుని కాస్త తక్కువ వయసున్న మహిళలా కనిపిస్తూ ముగ్గురిని తన ఉచ్చులోకి లాగి అందినకాడికి నగదు, నగలు దోచుకుంది. 

శరణ్య తొలుత పుత్తూరుకు చెందిన రవి అనే వ్యక్తిని పెళ్లాడింది. ఆ తర్వాత కొంతకాలానికి సుబ్రమణి అనే వ్యక్తిని రెండో పెళ్లి చేసుకుంది. శరణ్య మోసాలకు తల్లి శాంతమ్మ సహకరించేది. రవి నుంచి భారీగా సొమ్ము నొక్కేసిన ఈ తల్లీకూతుళ్లు ఆ తర్వాత సుబ్రమణి నుంచి కూడా భారీగా రాబట్టారు. అయితే,  కరోనా సంక్షోభం రావడంతో వారి వద్ద ఉన్న డబ్బులు అయిపోగా, శరణ్య మరో పెళ్లికి తెరదీసింది.

ఈసారి తమిళనాడుకు చెందిన 35 ఏళ్ల గణేశ్ అనే వ్యక్తిని ఉచ్చులోకి లాగింది. మేకప్ తో మేనేజ్ చేస్తూ తనకు 30 ఏళ్లేనంటూ అతడిని నమ్మించింది. పెళ్లయిన తర్వాత, శరణ్య, శాంతమ్మ ఆస్తి కోసం అతడిని నానా తిప్పలు పెట్టారు. దాంతో ఆస్తి రిజిస్ట్రేషన్ కోసం ఆధార్ కార్డు ఇవ్వాలంటూ శరణ్యను గణేశ్ కోరాడు. ఆమె ఆస్తి వస్తుందన్న సంతోషంలో ఇంకేం ఆలోచించకుండా ఆధార్ కార్డు ఇచ్చేసింది. 

అయితే, అందులో ఆమె వయసు 54 ఏళ్లని చూసి గణేశ్ నివ్వెరపోయాడు. 54 ఏళ్ల మధ్యవయస్కురాలినా తాను పెళ్లాడింది? అనుకుని తీవ్ర ఆవేదనకు లోనయ్యాడు. వెంటనే తమిళనాడులోని ఆవడి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిత్యపెళ్లికూతురు శరణ్యను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా, గతంలో రెండు పెళ్లిళ్లు చేసుకున్న విషయం కూడా వెల్లడించింది.