ఏపీ ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్‌ను కారులోకి తోస్తున్న ర‌ఘురామ సిబ్బంది.. వీడియోను బ‌య‌ట‌పెట్టిన విజ‌య‌సాయిరెడ్డి

05-07-2022 Tue 20:05
  • త‌న ఇంటి వ‌ద్ద రెక్కీ చేస్తున్నార‌ని ర‌ఘురామ‌రాజు ఆరోప‌ణ‌
  • రెక్కీ చేస్తున్న ఏపీ ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్‌ను కారులోకి తోస్తున్న సిబ్బంది
  • వీడియోను పోస్ట్ చేస్తూ సాయిరెడ్డి పరోక్ష వ్యాఖ్య‌లు
ysrcp mp vijay sai reddy post a video showing raghuramakrishna raju staff assaulting ap intelligence constable
వైసీపీ, ఆ పార్టీ రెబ‌ల్ ఎంపీ ర‌ఘురామ‌కృష్ణ రాజుల మ‌ధ్య వివాదం మ‌రింత‌గా ముదిరింది. రెక్కీ ఆరోప‌ణ‌ల‌తో తనపై రఘురామకృష్ణరాజు సిబ్బంది తనపై దాడి చేశారంటూ ఏపీ ఇంటెలిజెన్స్‌కు చెందిన కానిస్టేబుల్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుతో ఇప్ప‌టికే ర‌ఘురామ‌రాజుపై హైద‌రాబాద్‌లోని గ‌చ్చిబౌలి పోలీసులు కేసు న‌మోదు చేయ‌గా...తాజాగా కానిస్టేబుల్‌ను కారులోకి తోస్తున్న వీడియోను వైసీపీ రాజ్య‌స‌భ స‌భ్యుడు వేణుంబాక విజ‌య‌సాయిరెడ్డి విడుద‌ల చేశారు.

ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్‌పై దాడి చేయ‌డానికి సిగ్గు లేదా? అంటూ ర‌ఘురామ‌రాజును పేరు ప్రస్తావించకుండా ప్ర‌శ్నించిన సాయిరెడ్డి... తీవ్ర వ్యాఖ్య‌ల‌తో కూడిన ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌కే దాడికి సంబంధించిన వీడియోను సాయిరెడ్డి జ‌త చేశారు. ఈ వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఈ వీడియోలో కానిస్టేబుల్‌ను ఎత్తి కారులో వేసుకుని అక్క‌డి నుంచి త‌ర‌లించారు.