బోనాలకు వచ్చినంత జనం కూడా బీజేపీ సభకు రాలేదని మంత్రులు మాట్లాడడం వారి అవివేకానికి నిదర్శనం: విజయశాంతి

05-07-2022 Tue 19:10
  • ఇటీవల బీజేపీ విజయ సంకల్ప సభ
  • గ్రాండ్ సక్సెస్ అయిందన్న విజయశాంతి
  • కేసీఆర్ అండ్ కో శునకానందం పొందుతున్నారని విమర్శలు
  • తెలంగాణలో కాషాయ జెండా ఎగరడం ఖాయమని ధీమా
Vijayasanthi slams Telangana ministers
తెలంగాణలో జరిగిన బీజేపీ విజయ సంకల్ప సభతో టీఆర్ఎస్ నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని తెలంగాణ బీజేపీ నేత విజయశాంతి పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన రాష్ట్రంలోని బీజేపీ శ్రేణుల్లో నూతనోత్సాహం నింపిందని తెలిపారు. ప్రధాని సభ గ్రాండ్ సక్సెస్ అయిందని హర్షం వ్యక్తం చేశారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సిద్ధంగా ఉండాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సూచించినట్టు విజయశాంతి వెల్లడించారు. 

కాగా, బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సొమ్ముతో ప్రకటనలు ఏర్పాటు చేసుకుని వెకిలి ఆనందం పొందిందని విమర్శించారు. బోనాలకు వచ్చినంత జనం కూడా బీజేపీ సభకు రాలేదని రాష్ట్ర మంత్రులు మాట్లాడడం వారి అవివేకానికి నిదర్శనం అని పేర్కొన్నారు. అసలు, పార్టీ మీటింగ్ ను బోనాలతో పోల్చడమేంటని విజయశాంతి ప్రశ్నించారు.

కేసీఆర్ బృందం మోదీని తిడుతూ అల్ప సంతోషాన్ని పొందుతోందని విమర్శించారు. మరోసారి అధికారంలోకి వస్తామని సీఎం కేసీఆర్ పగటి కలలు కంటున్నారని, కానీ తెలంగాణలో ఈసారి కాషాయ జెండా ఎగరడం ఖాయమని విజయశాంతి స్పష్టం చేశారు.