APPSC: 2018 గ్రూప్‌-1 ఫలితాలు ప్ర‌క‌టించిన ఏపీపీఎస్సీ... టాప‌ర్ల‌లో హైద‌రాబాద్ యువ‌తి

  • 167 పోస్టుల భ‌ర్తీకి 2018లో నోటిఫికేష‌న్‌
  • 163 పోస్టుల‌ను మాత్ర‌మే భ‌ర్తీ చేసిన ఏపీపీఎస్సీ
  • టాప్ 3 ర్యాంకుల్లో ఇద్ద‌రు యువ‌తులు, ఓ పురుషుడు
  • మూడో ర్యాంకు సాధించిన తెలంగాణ యువ‌తి
appsc releases 2018 group1 results

ఏపీలో గ్రూప్-1 పోస్టుల భ‌ర్తీ కోసం విడుద‌ల చేసిన నోటిఫికేష‌న్‌కు సంబంధించిన తుది ఫ‌లితాలు విడుద‌ల‌య్యాయి. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (ఏపీపీఎస్సీ) చైర్మ‌న్ గౌతం స‌వాంగ్ మంగ‌ళ‌వారం ఈ ఫ‌లితాల‌ను ప్ర‌క‌టించారు. మొత్తం 167 పోస్టుల భ‌ర్తీకి 2018లో ఏపీపీఎస్సీ నోటిఫికేష‌న్ విడుద‌ల చేయ‌గా... కోర్టుల్లో కేసుల కారణంగా పోస్టుల భ‌ర్తీ ప్రక్రియ‌లో జాప్యం చోటుచేసుకుంది. 

తాజాగా ప్ర‌కటించిన ఫ‌లితాల్లో 167 పోస్టుల‌కు గాను 163 పోస్టులు భ‌ర్తీ కాగా... వివిధ కార‌ణాల వ‌ల్ల 4 పోస్టుల‌ను ఏపీపీఎస్సీ భ‌ర్తీ చేయ‌లేదు. ఉద్యోగాల‌కు ఎంపికైన వారిలో 67 మంది మ‌హిళ‌లు ఉండ‌గా.. 96 మంది పురుషులు ఉన్నారు. ఇక టాప‌ర్ల విష‌యానికి వ‌స్తే తొలి, రెండు ర్యాంకుల్లో ఏపీకి చెందిన అభ్య‌ర్థులే ఉండ‌గా... మూడో ర్యాంకులో తెలంగాణ‌కు చెందిన యువ‌తి నిలిచింది.

ఫ‌లితాల్లో టాప‌ర్‌గా పిఠాపురానికి చెందిన రాణి సుష్మిత నిల‌వ‌గా.. రెండో ర్యాంకులో క‌డ‌ప జిల్లాకు చెందిన శ్రీనివాస‌రాజు నిలిచారు. ఇక మూడో ర్యాంక‌ర్‌గా హైద‌రాబాద్‌కు చెందిన సంజ‌నా సింహా నిలిచారు. తొలి ర్యాంకుతో పాటు తొలి మూడు ర్యాంకుల్లో ఇద్ద‌రు యువ‌తులే నిల‌వ‌డం గ‌మ‌నార్హం.

ఫ‌లితాల విడుద‌ల సంద‌ర్భంగా ఏపీపీఎస్సీ చైర్మ‌న్ గౌతం స‌వాంగ్ మీడియాతో మాట్లాడారు. ఇంట‌ర్వ్యూల కోసం మొత్తంగా మూడు బోర్డుల‌ను ఏర్పాటు చేశామ‌ని ఆయ‌న ప్ర‌క‌టించారు. ఈ బోర్డుల ద్వారా ఇంట‌ర్వ్యూల ప్రక్రియ‌ను అత్యంత పార‌ద‌ర్శ‌కంగా నిర్వ‌హించామని ఆయ‌న తెలిపారు. ఈ పోస్టుల భ‌ర్తీలో హైకోర్టు ఆదేశాల‌ను తు.చ త‌ప్ప‌కుండా పాటించామ‌ని కూడా ఆయ‌న పేర్కొన్నారు.

More Telugu News