టెస్టుల్లో అత్యుత్తమ ఆటగాడు ఇతడే: ఇంగ్లండ్ ఆటగాడిపై సెహ్వాగ్ ప్రశంసల జల్లు

05-07-2022 Tue 17:51
  • బర్మింగ్ హామ్ లో ఇంగ్లండ్ విజయం
  • సెంచరీతో రాణించిన రూట్
  • సిరీస్ లో 4 సెంచరీలు అద్భుతమన్న సెహ్వాగ్
Sehwag says Joe Root is best test batsman in the world
ఇంగ్లండ్ జట్టు టెస్టుల్లో తమ అత్యుత్తమ ఛేదన నమోదు చేస్తూ టీమిండియాపై ఎడ్జ్ బాస్టన్ లో చారిత్రక విజయం సాధించడం తెలిసిందే. ఇంగ్లండ్ గెలుపులో జో రూట్, జానీ బెయిర్ స్టో సెంచరీలతో కీలకపాత్ర పోషించారు. 378 పరుగుల లక్ష్యఛేదనలో జో రూట్ ఎంతో సాధికారికంగా ఆడి 173 బంతుల్లో 142 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. 

ఈ నేపథ్యంలో, భారత క్రికెట్ దిగ్గజం వీరేంద్ర సెహ్వాగ్ స్పందించాడు. ఇప్పటికిప్పుడు ప్రపంచంలో అత్యుత్తమ టెస్టు బ్యాట్స్ మన్ ఎవరంటే రూట్ పేరే చెబుతానని వెల్లడించాడు. సిరీస్ లో నాలుగు సెంచరీలు సాధించడం అద్భుతమని కొనియాడాడు. రూట్ ఓ పరుగుల యంత్రం అంటూ సెహ్వాగ్ అభివర్ణించాడు.