ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెట్టినా ఉద్ధవ్​ థాకరేకు 100 సీట్లు వస్తాయి: సంజయ్​ రౌత్​

05-07-2022 Tue 17:50
  • ఎమ్మెల్యేలు వెళ్లినంత మాత్రాన ఓటర్లు దూరమైనట్టు కాదు
  • తిరుగుబాటు ఎమ్మెల్యేపై మహారాష్ట్ర ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు
  • డబ్బును, కేంద్ర దర్యాప్తు సంస్థలను అడ్డుపెట్టుకుని శివసేనను హస్తగతం చేసుకోలేరని ఏక్ నాథ్ షిండే, బీజేపీ నేతలపై ఫైర్
Even if elections are held now Uddhav Thackeray will get 100 seats Says Sanjay Raut
మహారాష్ట్రలో ఇప్పటికిప్పుడు అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తే ఉద్ధవ్ థాకరే కనీసం వంద సీట్లు అయినా గెలుచుకుంటారని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ చెప్పారు. కేవలం ఎమ్మెల్యేలు వెళ్లిపోయినంత మాత్రాన తమకు ఓటర్లు దూరమైనట్టు కాదని.. మహారాష్ట్ర ప్రజల్లో తిరుగుబాటు ఎమ్మెల్యేల మీద తీవ్ర ఆగ్రహం నెలకొని ఉందని పేర్కొన్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థలను, డబ్బును అడ్డం పెట్టుకుని శివసేనను హస్తగతం చేసుకోలేరని స్పష్టం చేశారు.

శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ థాకరే కూడా ఈ విషయంపై ఏక్ నాథ్ షిండే ఆధ్వర్యంలోని ఎమ్మెల్యేలకు సవాలు చేసిన విషయం తెలిసిందే. దమ్ముంటే రాజీనామా చేసి ఎన్నికలకు రావాలని.. ప్రజా క్షేత్రంలో తేల్చుకుందామని ఉద్ధవ్ సవాల్ చేశారు. దానికి కొనసాగింపుగానే తాజాగా సంజయ్ రౌత్ మాట్లాడారు.

‘‘రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు మధ్యంతర ఎన్నికలు పెట్టినా ఉద్ధవ్ థాకరే ఆధ్వర్యంలోని శివసేన 100 సీట్లకుపైగా గెలుచుకుంటుంది. ఉద్ధవ్ థాకరేపై ప్రజల్లో సానుభూతి ఉంది. అదే సమయంలో తిరుగుబాటు ఎమ్మెల్యేలపై ఆగ్రహం ఉంది. ఎవరైనా ఎమ్మెల్యే పార్టీ నుంచి వెళ్లిపోతే.. శివసేన తమ ఓటర్లను కోల్పోయినట్టు కాదు” అని సంజయ్ రౌత్ పేర్కొన్నారు.