మరో చారిత్రక కనిష్ఠానికి రూపాయి విలువ.. డాలర్​ కు రూ.79.36కు పతనం

05-07-2022 Tue 17:35
  • మరింతగా తరలిపోతున్న విదేశీ పెట్టుబడులు
  • డాలర్లకు విపరీతమైన డిమాండ్ తో బలహీనమవుతున్న భారత కరెన్సీ
  • అమెరికా, ఇతర దేశాల్లో వడ్డీ రేట్ల పెంపు కూడా కారణమే..
  • ఒక్క రోజే 41 పైసలు పడిపోయిన రూపాయి
The value of rupee to another historic low per dollar
అమెరికా డాలర్ తో పోల్చితే రూపాయి మారకం విలువ రోజు రోజుకూ మరింతగా పడిపోతోంది. దేశ చరిత్రలోనే అతి తక్కువగా మంగళవారం డాలర్ కు రూ.79.36 పైసలుకు రూపాయి విలువ పతనమైంది. దేశం నుంచి విదేశీ పెట్టుబడులు తరలిపోతుండటంతో డాలర్లకు డిమాండ్ బాగా పెరిగిందని.. ఇది రూపాయి బలహీనం కావడానికి కారణమైందని ఆర్థిక వేత్త అనుజ్ చౌదరి వెల్లడించారు. మన దేశ పారిశ్రామిక, ఇతర అభివృద్ధి గణాంకాలు కూడా బలహీనంగా ఉండటంతో పెట్టుబడులు వెనక్కి మళ్లుతున్నట్టు అంచనా వేశారు.

నిన్నటి ముగింపు కన్నా దిగువన మొదలై..
ఫారెక్స్ మార్కెట్లో సోమవారం రూపాయి రూ.78.95 పైసల వద్ద ముగిసింది. అయితే మంగళవారం ఉదయం అంతకన్నా దిగువన రూ.79.02 పైసల వద్ద ట్రేడింగ్ ప్రారంభమైంది. ఇంట్రా డేలో 79.02 పైసల వరకు పెరిగినా.. తర్వాత 79.38 పైసల దాకా కూడా పడిపోయింది. చివరన 79.36 పైసల వద్ద ముగిసింది. సోమవారం నాటి ముగింపుతో పోల్చితే 41పైసలు తగ్గిపోవడం గమనార్హం.