రూట్, బెయిర్ స్టో సెంచరీల మోత... టీమిండియాపై 378 పరుగుల లక్ష్యాన్ని ఊదిపారేసిన ఇంగ్లండ్

05-07-2022 Tue 16:41
  • టీమిండియాకు తీవ్ర నిరాశ
  • బర్మింగ్ హామ్ లో 7 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ విజయం
  • సిరీస్ 2-2తో సమం
England chased down 378 target with Root and Bairstow centuries
గతేడాది టీమిండియా, ఇంగ్లండ్ మధ్య 5 టెస్టుల సిరీస్ జరగ్గా, కరోనా కలకలం కారణంగా చివరి టెస్టు సాధ్యం కాలేదు. దాంతో ఆ టెస్టును రీషెడ్యూల్ చేసి తాజాగా బర్మింగ్ హామ్ లో నిర్వహించారు. ఈ టెస్టులో ఆతిథ్య ఇంగ్లండ్ జట్టే విజేతగా నిలిచింది. 378 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్ ఊదిపారేసింది. స్టార్ ఆటగాళ్లు జో రూట్ (142 నాటౌట్), జానీ బెయిర్ స్టో (114 నాటౌట్) సెంచరీలతో కదం తొక్కారు. టీమిండియా బౌలర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ఇంగ్లండ్ ను విజయతీరాలకు చేర్చారు. 

నాలుగో రోజు ఆటలో ఇంగ్లండ్ ఓపెనర్ల దూకుడును అడ్డుకుని మూడు వికెట్లు తీసిన టీమిండియా బౌలర్లను రూట్, బెయిర్ స్టో సమర్థంగా ఎదుర్కొన్నారు. మరో వికెట్ పడకుండా నాలుగో రోజు ఆట ముగించిన ఈ జోడీ, ఐదో రోజు వేగంగా పనిపూర్తిచేసింది. దాంతో ఇంగ్లండ్ 7 వికెట్ల తేడాతో విజయభేరి మోగించింది. తద్వారా సిరీస్ ను 2-2తో సమం చేసింది. 

ఈ మ్యాచ్ లో గెలిచి 3-1తో సిరీస్ కైవసం చేసుకుందామని ఆశించిన టీమిండియాకు తీవ్ర నిరాశ తప్పలేదు. కనీసం డ్రా చేసుకున్నా సిరీస్ గెలిచే అవకాశం ఉండగా, ఇంగ్లండ్ జట్టు ఆ చాన్స్ ఇవ్వలేదు. 

ఈ మ్యాచ్ లో మొదట టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో 416 పరుగులు చేయగా, ఇంగ్లండ్ 284 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ లో టీమిండియా 245 పరుగులు మాత్రమే చేయగలిగింది. తద్వారా ఇంగ్లండ్ ముందు 378 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ టార్గెట్ ను ఇంగ్లండ్ 76.4 ఓవర్లలో లాగించేసింది.