ఊపిరితిత్తుల ఆరోగ్యం కోసం మేలైన ఆహారపదార్థాలు ఇవిగో!

05-07-2022 Tue 16:25
  • శ్వాసక్రియకు ప్రధాన అవయవాలు ఊపిరితిత్తులు
  • ఊపిరితిత్తులు దెబ్బతింటే మిగతా అవయవాలపై ప్రభావం
  • ఆహార పదార్థాలతో ఊపిరితిత్తులు బలోపేతం
  • నిత్యం లభించే పదార్థాలతోనే ఊపిరితిత్తుల ఆరోగ్యం
Best foods for Lungs health
మానవ దేహంలో ప్రతి వ్యవస్థ కీలకమైనదే. ఏ ఒక్క వ్యవస్థ సాఫీగా పనిచేయకపోయినా, ఆ ప్రభావం ఇతర వ్యవస్థలపై పడుతుంది. ఈ నేపథ్యంలో, ఊపిరితిత్తుల ఆరోగ్యం ఎంతో ముఖ్యమైనది. మానవ శ్వాస వ్యవస్థలో ఊపిరితిత్తులు ప్రధాన అవయవాలు. ప్రస్తుత జీవనశైలిలో ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఎంతో అవసరం. 

పెరిగిపోతున్న కాలుష్యం, అపరిశుభ్ర పరిసరాలు, ధూమపానం, వివిధ రకాల వైరస్ లు ఊపిరితిత్తులకు ప్రధాన శత్రువులు. ఊపిరితిత్తులు బలంగా ఉంటేనే ఇలాంటి సమస్యలను ఎదుర్కొనేందుకు సాధ్యపడుతుంది. అందుకోసం నిపుణులు కొన్ని ఆహార పదార్థాలను సూచించారు. వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఊపిరితిత్తులు ఆరోగ్యాన్ని సంతరించుకుంటాయట.

ఊపిరితిత్తులను ప్రభావితం చేసే జబ్బుల్లో ఆస్తమా ఒకటి. లంగ్ ఫైబ్రోసిస్ కూడా ఊపిరితిత్తుల పాలిట ప్రమాదకారే. దానిమ్మ గింజలను తినడం వల్ల ఇలాంటి రుగ్మతలను ఎదుర్కొనే శక్తిని ఊపిరితిత్తులు పొందగలుగుతాయి. ఆస్తమా, లంగ్ ఫైబ్రోసిస్ బాధితులు దానిమ్మ వల్ల ఎంతో ఉపశమనం పొందుతారట. 

ఇక ఆపిల్స్ లోనూ ఊపిరితిత్తుల సమస్యలను ఎదుర్కొనే ఔషధ గుణాలు ఉన్నాయని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. ఆపిల్స్ ను తరచుగా తినడం వల్ల క్రానిక్ అబ్ స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ (సీఓపీడీ) తీవ్రత తగ్గిపోతుందని పరిశోధకులు గుర్తించారు. తద్వారా ఊపిరితిత్తులు బలంగా తయారవుతాయి.

మనం రోజూ ఆహారంలో ఉపయోగించే అల్లం కూడా తక్కువదేమీ కాదు. అవయవాల్లో అంతర్గత వాపును కట్టడి చేసే యాంటీ ఇన్ ఫ్లమేటరీ పదార్థాలు అల్లంలో పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు, ఊపిరితిత్తుల్లో తయారయ్యే చిక్కటి శ్లేష్మాన్ని పలుచన చేసి, దాన్ని బయటికి పంపించివేయడంలో అల్లం కీలకపాత్ర పోషిస్తుంది. 

మన వంటింట్లో లభించే పసుపులోని ఔషధ గుణాల గురించి తెలిసిందే. పసుపులో ఉండే కుర్కుమిన్ పదార్థం అనేక పల్మనరీ వ్యాధులను నయం చేయడంలోనూ, అంతర్గత వాపులను తగ్గించడంలోనూ ఉపయోగపడుతుంది. 

మార్కెట్లో లభించే గుమ్మడికాయలు సైతం ఊపిరితిత్తులకు స్నేహపూర్వక పదార్థాలే. గుమ్మడికాయల్లో ఉండే బీటా కెరోటిన్, ల్యుటీన్, జియాక్జాంతిన్ వంటి పదార్థాలు యాంటీ ఆక్సిడెంట్లుగా వ్యవహరిస్తాయి. ఊపిరితిత్తులలో ఏర్పడే ఇన్ఫెక్షన్లపై పోరాడడమే కాదు, అంతర్గత వాపు తీవ్రతను తగ్గిస్తాయి. 

మనం నిత్యం ఉపయోగించే పదార్థాల్లో వెల్లుల్లికి ప్రముఖ స్థానం ఉంటుంది. ఇందులో అల్లిసిన్ అనే పదార్థం ఉంటుంది. శ్వాస తీసుకోవడానికి ఇబ్బందిపడే వారికి వెల్లుల్లి దివ్యౌషధం వంటిదట. ఇందులోని అల్లిసిన్ శ్వాసనాళాలకు అడ్డుపడిన చెడు పదార్థాలను తొలగించి, ధారాళంగా శ్వాస ఆడేందుకు సహకరిస్తుంది. అంతేకాదు, ఉబ్బసం వంటి జబ్బులకు వెల్లుల్లి ఔషధంగానూ పనిచేస్తుంది. 

కాప్సికం కూడా ఊపిరితిత్తుల ఆరోగ్యానికి ఎంతో దోహదపడుతుంది. కెరోటినాయిడ్స్, విటమిన్ సి సమృద్ధిగా ఉంటాయి. కెరోటినాయిడ్స్ ఊపిరితిత్తుల క్యాన్సర్ ముప్పును తగ్గించడంలో విశేషంగా తోడ్పడతాయి. ఇక విటమిన్ సి దెబ్బతిన్న ఊపిరితిత్తుల మరమ్మతులకు సహాయపడుతుంది.