GST: ఆరోగ్య బీమాపై 18 శాతం.. వజ్రాలపై 1.5 శాతమే జీఎస్టీ.. ప్రధాని మోదీ ఎవరిపై ప్రేమ చూపుతున్నారో తెలిసిపోతోంది: రాహుల్ గాంధీ

  • ఆహార ధాన్యాలపై 5 శాతం జీఎస్టీ సరికాదు
  • తక్కువగా ఒకే శ్లాబ్ జీఎస్టీ ఉంటే పేదలు, మధ్య తరగతి వారికి ప్రయోజనం
  • ప్రభుత్వం కూడా ఇష్టమొచ్చినట్టు పన్నులు పెంచే వీలు ఉండదు
  • కేంద్ర ప్రభుత్వ తీరును తప్పుపడుతూ రాహుల్ గాంధీ ట్వీట్
18 percent on health insurance one and half percent GST on diamonds It is clear who PM Modi is cares for says Rahul Gandhi

వస్తు సేవల పన్ను (జీఎస్టీ) అమలు తీరుపై కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. పలు రకాల ఆహార పదార్థాలు, ధాన్యాలపై 5 శాతం జీఎస్టీ విధిస్తూ జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం తీసుకోవడాన్ని తప్పుపట్టారు. డబ్బున్న వారికి అనుకూలంగానే బీజేపీ ప్రభుత్వ విధానాలు ఉన్నాయని విమర్శించారు. జీఎస్టీని గబ్బర్ సింగ్ ట్యాక్స్ అంటూ మరోసారి మండిపడ్డారు. పలు సేవలు, ఉత్పత్తులపై జీఎస్టీని పోలుస్తూ ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. 

బాధాకర చిహ్నమిది..
‘‘హెల్త్ ఇన్సూరెన్స్ (ఆరోగ్య బీమా)పై 18 శాతం జీఎస్టీ, ఆసుపత్రుల్లో గదులపై 5 శాతం జీఎస్టీ.. అదే వజ్రాలపై మాత్రం 1.5 శాతమే జీఎస్టీ.. ప్రధాన మంత్రి ఎవరి పట్ల శ్రద్ధ చూపుతారనే బాధాకరమైన విషయానికి గబ్బర్ సింగ్ ట్యాక్స్ (జీఎస్టీ) చిహ్నం. తక్కువ రేటుతో ఉండే ఒకే శ్లాబ్ జీఎస్టీతో అత్యవసరమైన, నిత్యావసరాల ధరలు నియంత్రణలోకి వస్తాయి. పేదలు, మధ్య తరగతి ప్రజలపై భారం తగ్గుతుంది. అదే సమయంలో ప్రభుత్వాలు తమకు ఇష్టమొచ్చినట్టుగా పన్నులు పెంచడం ఆగిపోతుంది..” అని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.

పలు నిత్యావసరాలు జీఎస్టీ పరిధిలోకి..
ముందుగానే ప్యాక్ చేసి, లేబుల్ వేసిన మాంసం, చేపలు, పెరుగు, పనీర్, తేనె, గోధుమ, ఇతర ధాన్యాలు, బెల్లం, పేలాలను 5 శాతం జీఎస్టీ పరిధిలోకి తీసుకొస్తూ జీఎస్టీ మండలి గత నెల 28న  నిర్ణయం తీసుకుంది. దీనిపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి.

More Telugu News