USA: కలగంటి.. కలగంటి.. రెండు కోట్లు గెలుచుకొంటి!.. కలలో కనిపించిన లాటరీ టికెట్​ కొంటే భారీగా డబ్బులు

man wins crores prize using lottery numbers that he saw in a dream
  • కలలో వచ్చిన నంబర్ తో లాటరీ టికెట్ కొన్న అమెరికా వ్యక్తి
  • రెండు డాలర్లు పెట్టి కొంటే రెండున్నర లక్షల డాలర్ల బహుమతి 
  • సోషల్ మీడియాలో వైరల్ గా కల ఘటన
  • మా కోసమూ కలగనవా అంటూ కామెంట్లు
తెల్లవారు జామున వచ్చే కలలు నిజమవుతాయంటారు. కానీ ఆయన తెల్లవారు జామున కల గన్నాడో, అనుకోకుండా జరిగిందో గానీ కల నిజమై కోటీశ్వరుడైపోయాడు. కేవలం 150 రూపాయలు ఖర్చు పెట్టి ఏకంగా రెండు కోట్ల రూపాయలు దక్కించుకున్నాడు. అదీ ఓ లాటరీ ద్వారా జరగడం, తాను వరుస సెట్ నంబర్ల టికెట్ కొనడం ఇంటర్ నెట్ లో వైరల్ గా మారింది.

కలలో ధనవంతుడై పోయి..
అమెరికాలోని వర్జీనియా ప్రాంతానికి చెందిన అలోంజో కోల్‌ మాన్‌ గతంలోనే రిటైరై ఇంట్లో ఉంటున్నాడు. అప్పటికీ ఆయన డబ్బు సంపాదనపై కాస్త ఆశతో ఉన్నాడు. ఆ ఆశతోనే ఏమోగానీ ఓ రోజు మంచి కల వచ్చింది. తాను 13-14-15-16-17-18-19 నంబర్ల సెట్ ఉన్న లాటరీ టికెట్ కొన్నట్టు, దానిలో తనకు భారీగా సొమ్ము వచ్చి ధనవంతుడై పోయినట్టు కలలో కనిపించింది. మనమైతే ఏముంది ఇలాంటి కలలు చాలానే వస్తాయని అనుకుంటూ ఉంటాం. కానీ కోల్ మాన్ మాత్రం దీనిని సీరియస్ గా తీసుకున్నాడు.

ఒక సెట్ తక్కువగా దొరికినా..
గత నెలలో తనకు కలలో కనిపించిన నంబర్లు ఉన్న లాటరీ టికెట్ కోసం ప్రయత్నించాడు. అచ్చంగా అది కాకున్నా ఒక సెట్ తక్కువగా 13-14-15-16-17-18 సెట్ నంబర్ లాటరీ టికెట్ దొరికింది. దానిని రెండు డాలర్లు (మన కరెన్సీలో సుమారు 156 రూపాయలు) పెట్టి కొన్నాడు. నిజంగానే లాటరీ తగులుతుందా? లేక కల ఉత్తిదేనా? అని ఎదురు చూశాడు. గత నెల 11న ఆ లాటరీ డ్రా తీశారు. ఆ రోజున లాటరీ వెబ్ సైట్ ఓపెన్ చేసి చూసిన కోల్ మాన్ ఎగిరి గంతేశాడు. ఎందుకంటే తాను కొన్న టికెట్ కు ఏకంగా రెండున్నర లక్షల డాలర్లు  (మన కరెన్సీలో సుమారు 1.97 కోట్ల రూపాయలు) బహుమతి వచ్చింది. ఇంకేం తన కలను గుర్తు చేసుకుంటూ.. సంబరంలో మునిగిపోయాడు.

కోల్ మాన్ కు కల నిజమైన విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో.. ‘ఆయన మళ్లీ మళ్లీ కలలు గని ఇంకెంత సంపాదిస్తాడో..’ అని కొందరు.. ‘కాస్త మా గురించి కూడా కల గని పెట్టరాదూ...’ అంటూ మరికొందరు కామెంట్లు పెడుతున్నారు.

USA
Dream
Lottery
Man Wins Crores

More Telugu News