Telangana: తెలంగాణలో ఎస్సై, కానిస్టేబుల్ పోస్టులకు ప్రిలిమినరీ పరీక్ష.. తేదీలు, వివరాలు ఇవిగో..

Preliminary exam for SI posts in Telangana on August 7
  • రాత పరీక్షల తేదీలను ప్రకటించిన పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు
  • ఎస్సై అభ్యర్థులు ఈ నెల 30 నుంచి, కానిస్టేబుల్ అభ్యర్థులు ఆగస్టు 10 నుంచి హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకునే అవకాశం
  • మొత్తం 554 ఎస్సై, 15,644 కానిస్టేబుల్‌ పోస్టులకు పరీక్షలు
తెలంగాణలో పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు ఆధ్వర్యంలో భర్తీ చేయనున్న ఎస్సై పోస్టులకు ఆగస్టు 7న, కానిస్టేబుల్ పోస్టులకు 21వ తేదీన ప్రిలిమినరీ పరీక్షలు జరుగనున్నాయి. ఈ మేరకు పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు సోమవారం పరీక్షల తేదీలను ప్రకటించింది. ఎస్సై అభ్యర్థులు ఈ నెల 30వ తేదీ నుంచి, కానిస్టేబుల్ పరీక్షలకు పోటీ పడేవారు వచ్చే నెల 10వ తేదీ నుంచి హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకోవచ్చని తెలిపింది. ప్రిలిమినరీ రాత పరీక్షలు నిర్దేశించిన తేదీల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరుగుతాయని తెలిపింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను, హాల్ టికెట్లను  www.tslprb.in వెబ్ సైట్ లో పొందవచ్చని సూచించింది.

   మొత్తం 554 ఎస్సై, 15,644 కానిస్టేబుల్‌ పోస్టులు
  • తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది ఏప్రిల్ 25న పోలీసు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే.
  • మొత్తంగా 554 ఎస్సై పోస్టులు, 15,644 కానిస్టేబుల్‌ పోస్టులను భర్తీ చేయనుంది. వీటికి తోడు 614 ప్రొహిబిషన్‌, ఎక్సైజ్‌ కానిస్టేబుల్‌ పోస్టులనూ భర్తీ చేయనున్నారు.
  • ఎస్సై పోస్టులకు 2.54 లక్షల మంది, కానిస్టేబుల్‌ పోస్టులకు 6.50 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నట్టు అధికారులు తెలిపారు.
  • ఎస్సై పోస్టులకు హైదరాబాద్‌ సహా 20 పట్టణాల్లో, కానిస్టేబుల్‌ పరీక్షలకు 40 పట్టణాల్లో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు వివరించారు.

Telangana
Police
preliminary exam
Police exam

More Telugu News