Jammu And Kashmir: లష్కరే తోయిబా ఉగ్రవాదులను పట్టుకున్న గ్రామస్థులు.. ఉగ్రవాదుల్లో ఒకడు బీజేపీ ఐటీ సెల్ చీఫ్!

Lashkar Terrorist Caught Was Jammu BJP Minority Morcha IT Cell Chief
  • ఓ ఇంట్లో దాక్కున్న ఉగ్రవాదులను పట్టుకుని బంధించిన గ్రామస్థులు
  • ఉగ్రవాదుల్లో ఒకడైన తాలిబ్ షా బీజేపీ క్రియాశీల సభ్యుడు
  • ఉగ్రవాదుల నుంచి ఏకే 47 తుపాకులు, పేలుడు పదార్థాల స్వాధీనం
  • గ్రామస్థుల ధైర్య సాహసాలపై సర్వత్ర ప్రశంసలు
  • నగదు బహుమతి ప్రకటించిన లెఫ్టినెంట్ గవర్నర్, పోలీస్ చీఫ్
జమ్మూకశ్మీర్‌లో గ్రామస్థులకు చిక్కిన ఇద్దరు పాక్ ప్రేరేపిత లష్కరే తోయిబా ఉగ్రవాదుల్లో ఒకరు బీజేపీ సభ్యుడని, ఆ పార్టీ మైనార్టీ మోర్చా సోషల్ మీడియా సెల్ ఇన్‌చార్జ్ అని తెలిసి అధికారులు షాకయ్యారు. ఓ మట్టి ఇంట్లో దాక్కున్న లష్కరే ఉగ్రవాదులైన తాలిబ్ హుస్సన్ షా, అతడి సహచరుడైన ఫైసల్ అహ్మద్ దార్‌‌లను రియాసీ గ్రామస్థులు పట్టుకుని తాళ్లతో బంధించారు. ఆపై పోలీసులకు అప్పగించారు. వారి నుంచి రెండు ఏకే 47 తుపాకులు, ఏడు గ్రనేడ్లు, ఒక పిస్టల్, పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. ఉగ్రవాదులను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారించగా షాకింగ్ విషయం వెలుగు చూసింది.

పట్టుబడిన ఉగ్రవాదుల్లో ఒకడైన తాలిబ్ హుస్సేన్ షా జమ్మూలో బీజేపీ మైనార్టీ మోర్చా సోషల్ మీడియా ఇన్‌చార్జ్‌గా, పార్టీ క్రియాశీల సభ్యుడిగా ఉన్న విషయం వెలుగు చూసింది. జమ్మూకశ్మీర్ బీజేపీ చీఫ్ రవీంద్ర రైనాతో తాలిబ్ హుస్సేన్ కలిసి ఉన్న పలు ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాను ముంచెత్తుతున్నాయి.

తాలిబ్ షా బీజేపీ క్రియాశీల సభ్యుడున్న వార్తలపై ఆ పార్టీ అధికార ప్రతినిధి ఆర్ఎస్ పఠానియా స్పందించారు. బీజేపీ ఆన్‌లైన్ సభ్యత్వమే ఇందుకు కారణమని పేర్కొన్నారు. ఆన్‌లైన్‌లో సభ్యత్వాలు ఇస్తుండడం వల్ల పార్టీలో చేరుతున్నవారు ఎవరో? ఏమిటో? తెలుసుకునే వీలు లేకుండా పోతోందన్నారు. ఉగ్రవాదులు దీనిని చక్కగా ఉపయోగించుకుంటున్నారని, తొలుత పార్టీలో చేరి అందరితో కలిసిపోవడం, ఆపై రెక్కీ నిర్వహించి అగ్రనాయకులను హతమార్చే కుట్రలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆన్‌లైన్ సభ్యత్వ నమోదు పార్టీకి లోపంగా పరిణమించిందని ఆవేదన వ్యక్తం చేశారు.

కాగా, ఈ ఏడాది మే 9న తాలిబ్ షాను జమ్మూకశ్మీర్ ప్రావిన్స్ ఐటీ, సోషల్ మీడియా సెల్ ఇన్‌చార్జ్‌గా బీజేపీ నియమించింది. ఉగ్రవాదులను పట్టుకున్న రియాసీ గ్రామస్థుల ధైర్య సాహసాలపై సర్వత్ర ప్రశంసలు కురుస్తున్నాయి. జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా గ్రామస్థులకు రూ. 5 లక్షల నగదు బహుమతి ప్రకటించగా, జమ్మూ కశ్మీర్ ఏడీజీపీ రూ. 2 లక్షలు ప్రకటించారు.
Jammu And Kashmir
Lashkar-e-Taiba
Reasi
Terrorists
BJP

More Telugu News