Team India: కెప్టెన్​ అవ్వగానే బూమ్​ బూమ్​ అనిపిస్తున్న బుమ్రా...ఇంగ్లండ్​ తో ఐదో టెస్టులో భారత్​ పట్టు

  • ఆల్ రౌండ్ షో చేసిన బుమ్రా
  • బ్యాట్ తో రికార్డు పరుగులు.. బౌలింగ్ లోనూ మూడు వికెట్లు
  • తొలి ఇన్నింగ్స్ లో భారత్ 416 పరుగులు
  • 84 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లో ఇంగ్లండ్ 
Captain Bumrahs allround heroics help India take control of 5th Test

రోహిత్ శర్మ కరోనా బారిన పడి జట్టుకు దూరం అవ్వడంతో అనూహ్యంగా భారత జట్టు కెప్టెన్సీ అందుకున్న పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఇంగ్లండ్ తో ఐదో టెస్టులో అద్భుతంగా ఆడుతున్నాడు. కపిల్‌‌ దేవ్‌‌ తర్వాత టెస్టు కెప్టెన్ అయిన పేసర్‌‌గా రికార్డు సృష్టించిన బుమ్రా..తన ఆటతో ఆ దిగ్గజ క్రికెటర్‌‌ను మరిపిస్తున్నాడు. బ్యాటింగ్, బౌలింగ్ లో  అదగరొడుతున్నాడు. అభిమానులు ముద్దుగా ‘బూమ్ బూమ్’అని పిలిచే బుమ్రా బౌలర్ గానే కాకుండా బ్యాటర్ గా కూడా బూమ్ బూమ్ అనిపించడంతో ఇంగ్లండ్ తో టెస్టులో భారత్ పట్టు బిగించింది. 

ఓవర్‌‌నైట్‌‌ స్కోరు 338/7తో  రెండో రోజు శనివారం ఆట కొనసాగించిన భారత్ తొలి ఇన్నింగ్స్‌‌లో 416 పరుగుల భారీ స్కోరు వద్ద ఆలౌటైంది. రవీంద్ర జడేజా 194 బంతుల్లో 13 ఫోర్లతో 104 సెంచరీ చేశాడు. టెస్టు కెరీర్‌‌లో అతనికిది మూడో శతకం. బుమ్రా 16 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో అజేయంగా 31 పరుగులు సాధించాడు. వాస్తవానికి జడేజా ఔటైన సమయంలో  375/9తో నిలిచిన భారత్ మరో పది పరుగులు చేస్తే గొప్పే అనిపించింది. కానీ,  బ్రాడ్‌‌ వేసిన ఓవర్లో బుమ్రా 4 ఫోర్లు, 2 సిక్సర్లతో ఏకంగా 29 పరుగులు రాబట్టాడు. దాంతో, ఒకే ఓవర్లో అత్యధిక రన్స్ (29) కొట్టిన బ్యాటర్ గా ప్రపంచ  రికార్డు సృష్టించడంతో పాటు జట్టుకు స్కోరు 400 దాటించాడు. 

అనంతరం బుమ్రా (3/35) బౌలింగ్ లోనూ చెలరేగాడు. పిచ్ పై ఎక్స్ ట్రా బౌన్స్ రాబడుతూ ఇంగ్లండ్ బ్యాటర్లను వణికించాడు. అద్బుతమైన బంతులతో ఓపెనర్లు లీస్‌‌ (6), క్రాలీ (9)తో పాటు ఒలీ పోప్‌‌ (10) వికెట్లు పడగొట్టాడు. ఆపై, జో రూట్‌‌ (31) ను మహ్మద్ సిరాజ్ పెవిలియన్‌‌ చేర్చగా...జాక్‌‌ లీచ్‌‌ (0)ను షమీ ఐదో వికెట్‌‌గా వెనక్కు పంపాడు. దాంతో, రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్  84/5 తో కష్టాల్లో పడింది. వర్షం పలుమార్లు అంతరాయం కలిగించడంతో రెండో రోజు కేవలం 38 ఓవర్ల ఆటే సాధ్యమైనప్పటికీ.. భారత్ పూర్తి ఆధిపత్యం చెలాయించి ఆతిథ్య జట్టును కోలుకోలేని దెబ్బ కొట్టింది. ప్రస్తుతం జానీ బెయిర్‌‌ స్టో (12 బ్యాటింగ్‌‌), బెన్‌‌ స్టోక్స్‌‌ (0 బ్యాటింగ్‌‌) క్రీజులో నిలిచారు. భారత్ 332 పరుగుల‌ ఆధిక్యంలో ఉంది. మిగిలిన ఐదు వికెట్లను ఈ రోజు వీలైనంత తొందరగా పడగొడితే ఈ మ్యాచ్లో భారత్ కచ్చితంగా గెలిచే అవకాశం కనిపిస్తోంది.

More Telugu News