Indian Railways: 20 రూపాయల చాయ్‌కి రూ. 50 సర్వీస్ చార్జ్.. శతాబ్ది ఎక్స్‌ప్రెస్ రైలులో వింత: వైరల్ అవుతున్న ట్వీట్

Passenger pays Rs 70 for a cup of tea during train journey
  • బిల్లు చూసి ఆశ్చర్యపోయిన ప్రయాణికుడు
  • ‘మరీ ఇంత దోపిడీనా’ అంటూ వాపోయిన వైనం
  • బిల్లును ఫొటో తీసి ట్విట్టర్‌లో షేరింగ్
  • తామేమీ ఎక్కువ వసూలు చేయలేదన్న ఐఆర్‌సీటీసీ
ఢిల్లీ-భోపాల్ మధ్య నడిచే శతాబ్ది ఎక్స్‌ప్రెస్ రైలులో కప్పు చాయ్ తాగిన ప్రయాణికుడికి చుక్కలు కనిపించాయి. ఆ చాయ్‌కి అతడు చెల్లించిన బిల్లు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. వినోద్ వర్మ అనే ప్రయాణికుడు జూన్ 28న ఇదే రైలులో ప్రయాణించాడు. రైలులో టీ తాగాలనిపించి ఆర్డర్ చేస్తే ఏకంగా రూ. 70 బిల్లు చేతిలో పెట్టారు. అందులో టీకి రూ. 20, సర్వీస్ చార్జ్ రూ. 50గా పేర్కొనడంతో వినోద్ వర్మ ఆశ్చర్యపోయాడు. వెంటనే ఆ బిల్లును ఫొటో తీసి ట్వీట్ చేశాడు. ‘రూ. 20 టీకీ రూ. 50 సర్వీస్ చార్జీనా?.. మరీ ఇంత దోపిడీనా?’ అని వాపోయాడు. 

ఇది చూసిన నెటిజన్లు సైతం ఆశ్చర్యపోయారు. రైలులో టీకి ఐదు రూపాయలే ఎక్కువని కామెంట్ చేస్తున్నారు. సర్వీస్ చార్జ్ వసూలు చేయకూడదంటూ ప్రభుత్వం ఇటీవల రెస్టారెంట్లకు జారీ చేసిన ఆదేశాల క్లిప్పింగులను మరికొందరు షేర్ చేస్తున్నారు. ఈ ట్వీట్ వైరల్ కావడంతో రైల్వే అధికారులు స్పందించారు. ప్రయాణికుడి నుంచి తాము అదనంగా ఎలాంటి మొత్తమూ వసూలు చేయలేదని వివరణ ఇచ్చారు. రాజధాని, శతాబ్ది వంటి రైళ్లలో ముందుగా ఆహారం బుక్ చేసుకోకుండా ప్రయాణ సమయంలో బుక్ చేస్తే రూ. 50 సర్వీస్ చార్జ్ చెల్లించాల్సి ఉంటుందంటూ 2018లో జారీ చేసిన సర్క్యులర్‌ను ప్రస్తావించారు.
Indian Railways
IRCTC
Shatabdi Express

More Telugu News