బర్మింగ్‌హామ్ టెస్టు: బుమ్రా దెబ్బకు ఇంగ్లండ్ విలవిల

03-07-2022 Sun 06:42
  • మూడు కీలక వికెట్లు పడగొట్టిన బుమ్రా
  • అంతకుముందు బ్యాటింగ్‌లో ప్రపంచ రికార్డు
  • టెస్టుల్లో మూడో సెంచరీ చేసిన రవీంద్ర జడేజా
  • 84 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్
England lose five in response to Indias 416
ఇంగ్లండ్‌తో జరుగుతున్న చివరి టెస్టులో భారత్ రెండో రోజు అద్భుతం చేసింది. తొలి రోజు బ్యాటింగ్‌లో తడబడి నిలదొక్కుకున్న టీమిండియా రెండో రోజూ అదరగొట్టింది. ఇక, స్టాండిన్ కెప్టెన్‌గా పగ్గాలు అందుకున్న జస్ప్రీత్ బుమ్రా బ్యాటింగ్‌లో ప్రపంచ రికార్డు క్రియేట్ చేయడమే కాకుండా బంతితోనూ చెలరేగి ఇంగ్లండ్ నడ్డి విరిచాడు. మూడు కీలక వికెట్లు తీసి ఆతిథ్య జట్టును కష్టాల్లోకి నెట్టేశాడు. దీంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ 5 వికెట్లు కోల్పోయి 84 పరుగులు చేసి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది.

ఓపెనర్లు అలెక్స్ లీస్ (6), జాక్ క్రాలీ (9)లను 27 పరుగులకే వెనక్కి పంపిన బుమ్రా అదే ఊపుతో ఒల్లీ పోప్ (10)ను కూడా అవుట్ చేసి ఇంగ్లండ్‌ను ఒత్తిడిలోకి నెట్టేశాడు. క్రీజులో కుదురుకుంటున్న జో రూట్‌ (31)ను సిరాజ్ వెనక్కి పంపగా, జాక్ లీచ్ (0)ను షమీ అవుట్ చేయడంతో ఇంగ్లండ్ 84 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లో పడింది. కాగా, అంతకుముందు వరుణుడు ఆటకు పలుమార్లు అంతరాయం కలిగించాడు.

అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 338/7తో రెండో రోజు ఆట ప్రారంభించిన భారత్ 416 పరుగులకు ఆలౌట్ అయింది. 83 పరుగులతో క్రీజులోకి వచ్చిన రవీంద్ర జడేజా మరో 17 పరుగులు జోడించి టెస్టుల్లో మూడో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మొత్తం 183 బంతులు ఎదుర్కొని 13 ఫోర్లతో శతకం సాధించాడు. తొమ్మిదో వికెట్‌గా జడేజా అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన బుమ్రా బ్రాడ్ బౌలింగులో చెలరేగిపోయాడు. ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. దీంతో భారత్ స్కోరు పరుగులు పెట్టింది. ఆ ఓవర్‌లో ఏకంగా నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్లు, ఒక సింగిల్ తీసి 29 పరుగులు పిండుకుని ప్రపంచ రికార్డు సృష్టించాడు. అదే ఓవర్‌లో బ్రాడ్ ఆరు ఎక్స్‌ట్రాలు ఇవ్వడంతో ఏకంగా 35 పరుగులు వచ్చాయి.