ప్రధానిని స్వాగతించడానికి సీఎం కేసీఆర్ రాకపోవడం రాజ్యాంగాన్ని అవమానించడమే: కేంద్రమంతి స్మృతి ఇరానీ

02-07-2022 Sat 20:45
  • హైదరాబాదులో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు
  • నగరానికి వచ్చిన ప్రధాని మోదీ
  • మోదీకి స్వాగతం పలికిన తలసాని
  • స్పందించిన స్మృతి ఇరానీ
Smriti Irani questioned CM KCR for not welcomed PM Modi in Hyderabad
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ నేడు హైదరాబాద్ రాగా, ఆయనకు స్వాగతం పలికే కార్యక్రమానికి సీఎం కేసీఆర్ గైర్హాజరయ్యారు. దీనిపై కేంద్రమంత్రి స్మృతి ఇరానీ విమర్శనాత్మకంగా స్పందించారు. ప్రధాని వస్తే స్వాగతించడానికి రాకపోవడం రాజ్యాంగాన్ని అవమానించడమేనని స్పష్టం చేశారు. కేసీఆర్ ఓ నియంత అని అభివర్ణించారు. 

"రాజ్యాంగ గౌరవాన్ని ఎవరు దెబ్బతీసినా వారు నియంతే అవుతారు... ఆ లెక్కన కేసీఆర్ కూడా నియంతే" అని పేర్కొన్నారు. అంతేకాదు, కేసీఆర్ ఉల్లంఘిస్తున్నది రాజ్యాంగపరమైన సంప్రదాయాలనే కాకుండా, సాంస్కృతికపరమైన సంప్రదాయాలను కూడా ఉల్లంఘిస్తున్నారని విమర్శించారు. 

"కేసీఆర్ కుటుంబానికి రాజకీయాలంటే ఓ సర్కస్ లా ఉన్నట్టుంది. కానీ రాజకీయాలంటే మాకు జాతీయ విధానం... అదొక మాధ్యమం. ఇవాళ తెలంగాణలో రాచరికపు పోకడలు కనిపిస్తున్నాయి. భారత్ లో ఇది ఎంతమాత్రం అనుసరణీయం కాదు" అంటూ స్మృతి ఇరానీ పేర్కొన్నారు. కానీ, ప్రధాని మోదీ మాత్రం కేసీఆర్ ను ఎంతో గౌరవంతో, హుందాతనంతో కలుస్తుంటారని వివరించారు.