మ‌హారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండేను శివ‌సేన నుంచి స‌స్పెండ్ చేసిన ఉద్ధ‌వ్ థాక‌రే

02-07-2022 Sat 19:14
  • పార్టీ వ్య‌తిరేక కార్య‌క‌లాపాల‌కు పాల్ప‌డ్డార‌ని ఉద్ధ‌వ్ ఆరోప‌ణ‌
  • ఈ కార‌ణంగానే షిండేను పార్టీ నుంచి స‌స్పెండ్ చేస్తున్న‌ట్లు వెల్ల‌డి
  • నేరుగా షిండేకు లేఖ రాసిన శివ‌సేన చీఫ్‌
uddhav thackeray suspends eknath shinde from shivsena
మ‌హారాష్ట్ర నూత‌న ముఖ్య‌మంత్రిగా రెండు రోజుల క్రితం ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టిన ఏక్ నాథ్ షిండే శివ‌సేన నుంచి స‌స్పెండ్ అయ్యారు. ఈ మేర‌కు శివ‌సేన అధినేత ఉద్ధ‌వ్ థాక‌రే... షిండేను పార్టీ నుంచి బహిష్క‌రిస్తూ శ‌నివారం ఓ ప్ర‌క‌ట‌న చేశారు. పార్టీ వ్య‌తిరేక కార్య‌క‌లాపాల్లో పాలుపంచుకున్నందుకే షిండేను పార్టీ నుంచి బ‌హిష్క‌రిస్తున్న‌ట్లు స‌ద‌రు ప్ర‌క‌ట‌న‌లో థాక‌రే పేర్కొన్నారు. 

ఈ విష‌యాన్ని నేరుగా షిండేకు తెలియ‌జేస్తూ ఆయ‌న‌కు థాక‌రే ఓ లేఖ రాశారు. శివ‌సేన నేతృత్వంలోని సంకీర్ణ సర్కారును కూల‌దోసే క్ర‌మంలో శివ‌సేన‌కు చెందిన మెజారిటీ ఎమ్మెల్యేల‌ను త‌న‌వైపున‌కు తిప్పుకున్న షిండే... విప‌క్షం బీజేపీతో క‌లిసి తాను అనుకున్న ప్ర‌ణాళిక‌ను దిగ్విజ‌యంగా పూర్తి చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో మైనారిటీలో ప‌డిపోయిన ఉద్ధవ్ సీఎం ప‌ద‌వికి రాజీనామా చేయ‌గా... స్ప‌ష్ట‌మైన ఆధిక్య‌త‌తో ఉన్న షిండే సీఎంగా ప్ర‌మాణం చేశారు.