వరలక్ష్మి శరత్ కుమార్ డేట్స్ దొరకడమే కష్టమట!

02-07-2022 Sat 18:54
  • కోలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన వరలక్ష్మి 
  • ఆశించినస్థాయిలో సాగని కెరియర్ 
  • విలన్ వేషాల వైపు వచ్చిన వరలక్ష్మి
  • రెండు భాషల్లోను ఫుల్ బిజీ   
Varalakshmi Sharathkumar Special
కోలీవుడ్ లో నిన్నటితరం మాస్ యాక్షన్ హీరో శరత్ కుమార్ కూతురు వరలక్ష్మి. చాలాకాలం క్రితమే హీరోయిన్ గా అక్కడ ఎంట్రీ ఇచ్చింది. అయితే ఒక స్టార్ హీరో వారసురాలిగా ఆమెకి ఉన్న పరిధి అడ్డంకిగా మారింది. ఈ నేపథ్యంలోనే నెగెటివ్ షేడ్స్ కలిగిన పాత్రలను ఆమె ఎంచుకుంది. అప్పుడు ఆమె తీసుకున్న నిర్ణయాన్ని చాలామంది విమర్శించారు. 

ఆ తరువాత తెరపై ఆమె విలనిజాన్ని చూసి ప్రేక్షకులు షాక్ అయ్యారు. ఆమెలో అంత గొప్ప నటి ఉందా అనుకుంటూ ఆశ్చర్యపోయారు. స్టార్ హీరోలు సైతం తమ సినిమాలలో ఆమె విలనిజాన్ని అంగీకరించారు. ఇదే సమయంలో ఆమె తన విలనిజాన్ని టాలీవుడ్ కి విస్తరించింది. 'తెనాలి రామకృష్ణ బీఏ బీఎల్' సినిమాతో ఆమె తెలుగు తెరకి పరిచయమైంది.

'క్రాక్' .. 'నాంది' సినిమాలలో పోషించిన పాత్రలు ఆమెకి ఇక్కడ మరింతమంది అభిమానులను సంపాదించిపెట్టాయి. ' పక్కా కమర్షియల్' సినిమాలో మెరిసిన వరలక్ష్మి శరత్ కుమార్, త్వరలో 'యశోద'తో పాటు బాలకృష్ణ 107వ సినిమాలోనూ కనిపించనుంది. అంతేకాదు గీతా ఆర్ట్స్ 2 వారు శ్రీకాంత్ తో చేస్తున్న సినిమాలో కీలకమైన పాత్రను పోషిస్తోంది. తమిళంలో అరడజనుకు పైగా సినిమాలు చేస్తున్న కారణంగా ఆమె డేట్స్ దొరకడమే మేకర్స్ కి కష్టంగా ఉందట.