Madhucon Group: టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వ‌ర‌రావు కంపెనీ ఆస్తుల‌ను జ‌ప్తు చేసిన ఈడీ

  • రాంచీలో ఎక్స్‌ప్రెస్ హైవేను నిర్మించిన మ‌ధుకాన్ గ్రూపు
  • బ్యాంకుల‌ను మోసం చేసింద‌ని 2002లో ఈడీ కేసు న‌మోదు
  • ఈ కేసులోనే రూ.96.21 కోట్ల ఆస్తుల‌ను జ‌ప్తు చేసిన ఈడీ
  • జప్తు జాబితాలో కంపెనీ, డైరెక్ట‌ర్లు, ప్ర‌మోట‌ర్ల ఆస్తులు
ED has provisionally attached 96 Crore rupees value properties of  Madhucon Group

ఓ వైపు బీజేపీ జాతీయ కార్య‌వ‌ర్గ స‌మావేశాలు, మ‌రోవైపు రాష్ట్రప‌తి ఎన్నిక‌ల్లో విప‌క్షాల ఉమ్మ‌డి అభ్య‌ర్థి య‌శ్వంత్ సిన్హాకు మ‌ద్ద‌తుగా టీఆర్ఎస్ స‌భ నేప‌థ్యంలో శ‌నివారం తెలంగాణ‌లో రాజ‌కీయ వేడి రాజుకుంది. తెలంగాణ రాజ‌ధాని హైద‌రాబాద్‌లో రెండు కీల‌క స‌మావేశాలు జ‌రుగుతున్న వేళ‌.. రాష్ట్రంలో అధికార పార్టీ టీఆర్ఎస్‌కు చెందిన ఎంపీ నామా నాగేశ్వ‌ర‌రావుకు చెందిన కంపెనీ ఆస్తుల‌ను అటాచ్ చేస్తూ ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్ట‌రేట్ శ‌నివారం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది.

రాజ‌కీయాల్లోకి రాక‌ముందే మ‌ధుకాన్ ప్రాజెక్ట్స్ పేరిట నామా నాగేశ్వ‌ర‌రావు ఓ కంపెనీని స్థాపించారు. ఈ కంపెనీ ప‌లు రంగాల‌కు విస్త‌రించి త‌న పేరును మ‌ధుకాన్ గ్రూప్‌గా మార్చుకుంది. నిర్మాణ రంగంలో ఉన్న ఈ కంపెనీ గ‌తంలో రాంచీలో ఎక్స్‌ప్రెస్ హైవేను నిర్మించింది. ఈ ప్రాజెక్టు కోసం రుణాలు తీసుకున్న మ‌ధుకాన్‌...వాటిని తిరిగి చెల్లించ‌లేద‌న్న ఆరోప‌ణ‌ల‌పై 2002లో ఈడీ కేసు న‌మోదు చేసింది. ఈ కేసులోనే కంపెనీతో పాటు కంపెనీ డైరెక్ట‌ర్లు, ప్ర‌మోట‌ర్ల‌కు చెందిన రూ.96.21 కోట్ల విలువ చేసే ఆస్తుల‌ను ఈడీ అటాచ్ చేసింది.

గ‌తంలో టీడీపీలో కొన‌సాగిన నామా నాగేశ్వర‌రావు రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత మారిన రాజ‌కీయ ప‌రిణామాల నేప‌థ్యంలో టీఆర్ఎస్‌లో చేరిన సంగ‌తి తెలిసిందే. 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఖ‌మ్మం లోక్ స‌భ స్థానం నుంచి టీఆర్ఎస్ అభ్య‌ర్థిగా పోటీ చేసి విజ‌యం సాధించారు. శ‌నివారం హైద‌రాబాద్ వ‌చ్చిన య‌శ్వంత్ సిన్హాకు బేగంపేట ఎయిర్ పోర్టులో సీఎం కేసీఆర్‌తో క‌లిసి స్వాగ‌తం ప‌లికారు. అనంత‌రం జ‌ల విహార్‌లో ఏర్పాటు చేసిన స‌మావేశంలోనూ ఆయ‌న పాలుపంచుకున్నారు. ఈ స‌మావేశంలో ఉన్న స‌మ‌యంలోనే నామా సంస్థ‌ల‌పై ఈడీ కొర‌డా ఝుళిపించడం గ‌మనార్హం.

More Telugu News