హెచ్ఐసీసీలో ప్రారంభమైన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు

02-07-2022 Sat 16:31
  • మోదీతో సహా హాజరైన బీజేపీ అగ్ర నాయకత్వం
  • మొత్తం 348 మంది ప్రతినిధులు హాజరు
  • పార్టీ బలోపేతం దిశగా సమావేశాల్లో చర్చించనున్న నేతలు
BJP national office bearers meeting started in Hyderabad
హైదరాబాద్ లోని హెచ్ఐసీసీలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాలకు ప్రధాని మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా బీజేపీ అగ్రనాయకత్వం మొత్తం హాజరయింది. బీజేపీ ముఖ్యమంత్రులు, పలువురు కేంద్రమంత్రులు సమావేశాలకు హాజరయ్యారు. మొత్తం 348 మంది ప్రతినిధులు హాజరయ్యారు. పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా ఈ సమావేశాల్లో చర్చించనున్నారు. దీనికి తోడు దేశంలోని రాజకీయ, సామాజిక పరిస్థితులపై కూడా చర్చించబోతున్నారు.

జాతీయ కార్యవర్గ సమావేశాలను జేపీ నడ్డా ప్రారంభించారు. మోదీ, జేపీ నడ్డా, పియూష్ గోయల్ మాత్రమే వేదికను అలంకరించారు. మోదీకి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్వాగతం పలికారు వందేమాతరం గీతంతో సమావేశాలను ప్రారంభించారు. వేదికపై శ్యామప్రసాద్ ముఖర్జీ, భరతమాత, దీన్ దయాల్ ఉపాధ్యాయ్ ల ఫొటోలను ఏర్పాటు చేశారు. రెండు రోజుల పాటు ఈ సమావేశాలు జరగనున్నాయి. 18 ఏళ్ల తర్వాత హైదరాబాద్ లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగుతుండటం గమనార్హం. తెలంగాణలో పాగా వేసే దిశగా పార్టీ శ్రేణులకు బీజేపీ అగ్ర నాయకత్వం మార్గనిర్దేశం చేయబోతోంది.