Michael Vaughan: మరోసారి వంకర బుద్ధి ప్రదర్శించిన ఇంగ్లండ్ మాజీ సారథి మైకేల్ వాన్

Michael Vaughan tweets on Pant innings and compared him with Johnny Bairstow
  • బర్మింగ్ హామ్ లో టీమిండియా, ఇంగ్లండ్ టెస్టు
  • తొలిరోజు ఆటలో పంత్ సెంచరీ హైలెట్
  • 111 బంతుల్లో 146 పరుగులు చేసిన పంత్
  • బెయిర్ స్టో లాగా ఆడాడన్న మైకేల్ వాన్
భారత క్రికెటర్లకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్నారు. సునీల్ గవాస్కర్ తరం నుంచి సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, వీరేంద్ర సెహ్వాగ్, మహేంద్ర సింగ్ ధోనీ, విరాట్ కోహ్లీ వంటి క్రికెటర్ల వరకు దేశాలకు అతీతంగా ప్రజాదరణ పొందారు. ప్రత్యర్థి జట్లు సైతం వారిని ఎంతో గౌరవిస్తుంటాయి. 

కానీ, ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ తీరే వేరు. అతడికి టీమిండియా అన్నా, భారత ఆటగాళ్లు అన్నా ఎందుకో గానీ గిట్టదు. ఓవైపు పొగుడుతూనే, మరోవైపు వారిపై తన అక్కసు వెళ్లగక్కుతుంటాడు. సోషల్ మీడియాను వినియోగించుకుని భారత అభిమానులను రెచ్చగొట్టే పోస్టులు పెడుతుంటాడు. గతంలో మైకేల్ వాన్ అనేక పర్యాయాలు ఇలాగే ప్రవర్తించాడు. తాజాగా తన వంకర బుద్ధిని మరోసారి ప్రదర్శించాడు. 

టీమిండియా, ఇంగ్లండ్ జట్ల మధ్య బర్మింగ్ హామ్ లో జరుగుతున్న టెస్టులో తొలిరోజు ఆటలో రిషబ్ పంత్ వీరోచిత సెంచరీ సాధిస్తే... వాన్ ఎలాంటి ట్వీట్ చేశాడో చూడండి. "రిషబ్ పంత్ ఆటను చూడడం బాగుంది... ఒక జానీ బెయిర్ స్టో లాగా ఆడాడు" అంటూ పంత్ స్వయంప్రతిభను తక్కువ చేసి చూపేందుకు ప్రయత్నించాడు. పంత్ ఏదో జానీ బెయిర్ స్టోను కాపీ కొట్టినట్టు తన వెకిలితనం వెళ్లగక్కాడు. 

అయితే, వాన్ ట్వీట్ కు భారత నెటిజన్లు దిమ్మదిరిగే రీతిలో ట్రోల్ చేశారు. ఇటీవలే పంత్ ను జానీ బెయిర్ స్టో కొట్టాడని కొందరు, రిషబ్ పంత్ ఎవరిలాగానో ఆడాల్సిన అవసరం ఏముంది... రిషబ్ పంత్ అంటే రిషబ్ పంతే... అతడి ఆట అతడిదే అంటూ మరికొందరు వాన్ కు రిప్లై ఇచ్చారు. కొందరు తెలుగు నెటిజన్లు కూడా వాన్ ట్వీట్ కు స్పందిస్తూ బూతులు గుప్పించారు. 

ఇటీవల న్యూజిలాండ్ తో సిరీస్ లో జానీ బెయిర్ స్టో కొన్ని దూకుడైన ఇన్నింగ్స్ ఆడాడు. వాటిని దృష్టిలో ఉంచుకునే మైకేల్ వాన్ తాజా ట్వీట్ చేసినట్టు అర్థమవుతోంది. అయితే, బెయిర్ స్టో ఆడిన అలాంటి ఇన్నింగ్స్ ను పంత్ ఎప్పుడో ఆడాడంటూ నెటిజన్లు వాన్ ట్వీట్ ను తిప్పికొట్టారు.
Michael Vaughan
Rishabh Pant
Johnny Bairstow
Birmingham
Team India
England

More Telugu News