Sleep duration: గుండె పదిలంగా ఉండాలంటే.. ఎంత సమయం నిద్రించాలి?

  • కనీసం ఏడు గంటలు అయినా ఉండాలి
  • తొమ్మిది గంటల వరకు నిద్రించొచ్చు
  • అమెరికన్ హార్ట్ అసోసియేషన్ చెక్ లిస్ట్ లోకి నిద్ర
  • నిద్ర తగ్గితే, నాణ్యమైన నిద్ర లేకపోతే గుండెకు రిస్క్
Sleep duration matters for heart health according to new recommendations

నేటి కాలంలో గుండె వైఫల్యాలు పెరుగుతుండడం చూస్తున్నాం. కంటి నిండా నిద్రించే భాగ్యం ఏ కొద్ది మందికో ఉంటోంది. ఎక్కువ మంది తగినంత సమయాన్ని నిద్రకు కేటాయించలేకపోతున్నారు. స్మార్ట్ ఫోన్ల వల్ల నిద్రా సమయం తగ్గుతున్నట్టు ఎన్నో అధ్యయనాలు చెప్పాయి. కుటుంబాన్ని పోషించుకునేందుకు నిద్రకు సమయం కేటాయించలేని వారు కూడా ఉన్నారు. కారణాలు ఏవైనా.. గుండె పదిలంగా ఉండాలంటే తగినంత నిద్ర పోవాల్సిందే.

అమెరికన్ హార్ట్ అసోసియేషన్ నిద్రా సమయాన్ని కార్డియో వాస్క్యులర్ హెల్త్ చెక్ లిస్ట్ లో చేర్చింది. గతంలో ఏడు అంశాలతో కూడిన జాబితాను ఎనిమిదికి పెంచింది. ఆహారం, శారీరక కదలికలు, నికోటిన్ ప్రభావానికి లోను కావడం, బాడీ మాస్ ఇండెక్స్, రక్తంలో లిపిడ్స్, రక్తంలో గ్లూకోజు, రక్తపోటు. ఇవన్నీ గుండె ఆరోగ్యాన్ని నిర్ణయించే అంశాలు. గడిచిన దశాబ్ద కాలంలో వైద్యులు రోగుల వైపు నుంచి పరిశీలించిన అంశాలు, అధ్యయనాల్లో వెల్లడైన అంశాల ఆధారంగా నిద్రా సమయాన్ని కూడా చెక్ లిస్ట్ లో చేర్చారు. నిద్ర తగినంత లేకపోతే రక్తపోటు, స్థూల కాయం, మధుమేహానికి దారితీస్తుందని వైద్యులు చెబుతున్నారు. వీటిల్లో ఏది వచ్చినా అది గుండె ఆరోగ్యాన్ని బలహీనపరుస్తుంది. 

ఎంత సమయం?
పెద్దలు రోజులో కనీసం 7 గంటల నుంచి గరిష్టంగా 9 గంటల వరకు నిద్రించాలని పల్మనాలజిస్ట్ డాక్టర్ రాజ్ దాస్ గుప్తా సూచించారు. యూనివర్సిటీ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియా, కెక్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ లో ఆయన క్లినికల్ అసోసియేట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు. 

మంచి లాభాలు పొందాలంటే నాణ్యమైన నిద్ర అవసరమని గుప్తా చెప్పారు. ‘‘నిద్రలో ఆర్ఈఎం, నాన్ఆర్ఈఎం అని పలు సైకిల్స్ ఉంటాయి. నాన్ ఆర్ఈఎంలో మూడో దశలో గాఢ నిద్రలోకి వెళతారు. అప్పుడే శరీరం మానసికంగా, శారీరకంగా పునరుద్ధానం చెందుతుంది. కానీ, మీరు తరచుగా నిద్ర లేస్తుంటే గాఢ నిద్ర దశలోకి వెళ్లలేరు. ఇది అధిక రక్తపోటు, బ్లడ్ షుగర్ కు దారితీస్తుంది. గుండె ఆరోగ్యాన్ని బలహీనపరిచి, గుండె వైఫల్యానికి దారితీస్తాయి’’అని డాక్టర్ దాస్ గుప్తా వివరించారు. ఆర్ఈఎం అంటే ర్యాపిడ్ ఐ మూమెంట్. వేగంగా కళ్లను కదిలిస్తుంటాం. 

అమెరికన్ హార్ట్ అసోసియేషన్ చెక్ లిస్ట్ ప్రకారం పొగతాగే వారు విడిచి పెట్టే పొగను పీల్చినా గుండెకు హాని కలుగుతుంది. టోటల్ కొలెస్ట్రాల్ ను చూడకుండా నాన్ హెచ్ డీఎల్ ను పరిగణనలోకి తీసుకుని వైద్యులు గుండె ఆరోగ్యాన్ని నిర్ధారిస్తారు.

More Telugu News