KTR: దమ్ బిర్యానీ రుచి చూడండి.. వెజ్ బిర్యానీ కూడా ఉంటుంది, అడగడం మర్చిపోవద్దు: మోదీకి రాసిన లేఖలో కేటీఆర్

please Taste dum biryani in Hyderabad ktr writes letter to modi
  • ఇరానీ చాయ్ తాగుతూ నూతన ఆలోచనలకు నాంది పలకాలన్న కేటీఆర్
  • మీ నికృష్ట రాజకీయాలకు పనితీరుతోనే సమాధానం చెప్పామన్న మంత్రి
  • రాజ్యాంగ బద్ధంగా దక్కిన బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, రైల్వే కోచ్ ఫ్యాక్టరీలు ఇవ్వకుండా వంచించారని మండిపాటు
హైదరాబాద్ వస్తున్న మోదీ సంప్రదాయ దమ్ బిర్యానీ రుచి చూడాలని తెలంగాణ మంత్రి కేటీఆర్ సూచించారు. వెజ్ బిర్యానీ కూడా దొరుకుతుందని, అడగడం మర్చిపోవద్దన్నారు. హైదరాబాదీల ఆతిథ్యం గొప్పగా ఉంటుందని అన్నారు. ఇరానీ చాయ్ తాగుతూ అద్భుతమైన తెలంగాణ గడ్డ నుంచి నూతన ఆలోచనలకు నాంది పలకాలని కోరారు. అంతరాలు లేని సమాజ నిర్మాణానికి ఆలోచన చేయాలని, కొత్త ఆరంభం వైపు అడుగులు వేయాలని సూచించారు. జాతీయ కార్యవర్గ సమావేశాల కోసం మోదీ, ఇతర అగ్రనేతలు హైదరాబాద్ వస్తున్న నేపథ్యంలో మోదీకి కేటీఆర్ రాసిన బహిరంగ లేఖలో ఆయనీ విషయాలను పేర్కొన్నారు.

సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియాగా మారబోతున్న హైదరాబాద్ ఐటీ రంగానికి మీరు పొడిచిన వెన్నుపోటును ఇక్కడి యువత మర్చిపోదని కేటీఆర్ అన్నారు. ఐటీఐఆర్‌ను రద్దు చేసి తెలంగాణ ప్రగతి ప్రస్థానాన్ని ఆపుదామన్న మీ నికృష్ట రాజకీయాలకు పనితీరుతోనే సమాధానం చెప్పామన్నారు. గత ఎనిమిదేళ్లలో తెలంగాణ ఐటీ ఎగుమతులను మూడు రెట్లు పెంచి రూ. 1.83 లక్షల కోట్లకు చేర్చినట్టు చెప్పారు. పార్లమెంటు సాక్షిగా తెలంగాణకు దక్కిన రాజ్యాంగబద్ధ హామీలైన బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, రైల్వే కోచ్ ఫ్యాక్టరీలు ఇవ్వకుండా వంచించిన చరిత్ర మీది అని కేటీఆర్ ఆ లేఖలో దుయ్యబట్టారు.

మీరు ఒక్క విద్యాసంస్థను ఇవ్వకున్నా గురుకులాలు, వైద్య కళాశాలలను పెద్ద ఎత్తున నిర్మించామని, తాము చేయని అభివృద్ధి అంటూ ఏమీ లేదని అన్నారు. ఇప్పటికైనా మించిపోయింది లేదని, మీ రాజకీయాలను, ఆలోచనను మార్చుకునే అవకాశాన్ని తెలంగాణ గడ్డ కల్పిస్తోందని, విధానాలను మార్చుకుంటారో, మిమ్మల్ని మీరే మభ్యపెట్టుకుంటారో మీ ఇష్టమని కేటీఆర్ ఆ లేఖలో తేల్చి చెప్పారు.
KTR
Telangana
BJP
TRS
Narendra Modi

More Telugu News