మోకాళ్ల నొప్పులకు నాటు వైద్యుడి వద్ద చికిత్స పొందుతున్న ధోనీ

01-07-2022 Fri 20:30
  • ఇటీవల ధోనీ రెండు మోకాళ్లలో నొప్పులు
  • రాంచీలో వందన్ సింగ్ వద్ద చికిత్స
  • ధోనీ ఎవరో తెలియకుండానే చికిత్స చేసిన వందన్ సింగ్
Dhoni gets herbal treatment for knee pain
టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీ రూటే వేరు! తాను ఏంచేసినా అది అందరి దృష్టిని ఆకర్షించేలా ఉంటుంది. తాజాగా, మోకాళ్ల నొప్పులకు ఓ నాటు వైద్యుడి వద్ద చికిత్స పొందాడు. ఇటీవల ధోనీ రెండు మోకాళ్లలో నొప్పులు వస్తున్నాయి. ఇతర చికిత్స విధానాల కంటే ఆయుర్వేదం మెరుగని భావించిన ధోనీ... రాంచీలో ఓ చెట్టు కింద వైద్యం చేసే వందన్ సింగ్ ను సంప్రదించాడు. వందన్ సింగ్ ఓ నాటు వైద్యుడు. మూలికలు, ఆకు పసర్లతో వైద్యం చేస్తుంటాడు. వందన్ సింగ్ వైద్యం గురించి తల్లిదండ్రుల ద్వారా తెలుసుకున్న ధోనీ... గత కొన్నిరోజులుగా వందన్ సింగ్ వద్ద చికిత్స పొందుతున్నాడు. 

కాగా, తన వద్దకు వచ్చిన ధోనీతో పాలతో కొన్ని వనమూలికలు కలుపుకుని తాగాలని వందన్ సింగ్ చెప్పినట్టు తెలుస్తోంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే... ధోనీ గురించి ఏమీ తెలియకుండానే వందన్ సింగ్ వైద్యం చేశాడు. ఇటీవల చాలామంది చెప్పడంతో ధోనీ పెద్ద క్రికెటర్ అని తెలిసిందట. రాంచీ పరిసర ప్రాంతాల్లో వందన్ సింగ్ మూలికావైద్యానికి ఎంతో పేరుంది. ధోనీ తల్లిదండ్రులు కూడా ఆయన వద్దకే వచ్చి వైద్యం చేయించుకుంటారట.