ట్రాక్ట‌ర్ల‌తో ట‌గ్ ఆఫ్ వార్‌!... ప్ర‌మాద‌మ‌ని తెలిసినా ఎగ‌బ‌డుతున్న క‌న్న‌డిగులు!

01-07-2022 Fri 17:42
  • క‌న్న‌డ‌నాట ట్రాక్ట‌ర్ల‌తో ట‌గ్ ఆఫ్ వార్‌
  • ప్ర‌మాద‌క‌ర‌మ‌ని తెలిసినా కొన‌సాగిస్తున్న క‌న్న‌డిగులు
  • సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారిన వీడియో
tug of war with tractors in karnataka video goes viral on social media
ట‌గ్ ఆఫ్ వార్‌.. అటో గుంపు, ఇటో గుంపు తాడును ప‌ట్టుకుని ప‌ర‌స్ప‌రం లాగేసుకునే ఆట‌. ఎవ‌రు బ‌లంగా తాడును లాగుతారో.. వారే విజేత‌లుగా నిలిచే ఆట‌. మ‌నుషుల మ‌ధ్య జ‌రిగే ఈ ఆట చాలా స‌ర‌దాగా కూడా ఉంటుంది. అయితే ఈ ఆట‌ను క‌న్న‌డిగులు ట్రాక్టర్ల‌తో ఆడుతున్నారు. రెండు ట్రాక్ట‌ర్ల‌కు వాటి వెనుక వైపుగా తాళ్ల‌ను క‌ట్టి.. ప‌ర‌స్ప‌రం విరుద్ధ మార్గాల్లో ట్రాక్ట‌ర్ల‌ను ప‌రుగెత్తించే ఈ ఆట‌కు సంబంధించిన వీడియో ఒక‌టి ఇప్పుడు సోషల్ మీడియాలో వైర‌ల్‌గా మారిపోయింది.

ట్రాక్ట‌ర్ల‌తో టగ్ ఆఫ్ వార్‌లో భాగంగా జ‌రిగిన ఈ పోటీలో ట్రాక్ట‌ర్లు ముందు టైర్లు గాల్లోకి లేచిపోతున్నాయి. ప్ర‌త్య‌ర్థి ట్రాక్ట‌ర్ బ‌లంగా లాగితే.. ఆవ‌లి వైపున్న ట్రాక్ట‌ర్ తిర‌గ‌బ‌డిపోతోంది. మ‌ళ్లీ నేల‌పై సాధార‌ణ స్థితికి వ‌చ్చేస్తూ త‌న‌ను లాగిన ట్రాక్ట‌ర్‌ను మ‌రింత బ‌లంగా లాగేస్తోంది. వేల మంది జ‌నం మ‌ధ్య‌లో ఈ పోటీలు జ‌రుగుతున్నాయి. ట్రాక్ట‌ర్లు మీద ప‌డితే ప్రాణాలే గాల్లో క‌లిసిపోయే ప్ర‌మాదం కూడా లేక‌పోలేదు. వెర‌సి ప్రాణాంత‌కంగా మారే ప్ర‌మాద‌మున్న ఈ క్రీడ‌ను క‌న్న‌డిగులు ఉత్సాహంగా సాగిస్తున్నారు.