Team India: నేటి నుంచి ఇంగ్లండ్ తో ఐదో టెస్టు.. బుమ్రా సారథ్యంలో భారత్ భళా అనిపిస్తుందా?

  • తొలిసారి బుమ్రా కెప్టెన్సీలో బరిలోకి 
  • రోహిత్, లోకేశ్ రాహుల్ లేకపోవడంతో జట్టుపై ఒత్తిడి
  •  ఫుల్ జోష్‌లో ఉన్న ఆతిథ్య ఇంగ్లండ్
India vs England fifth testFrom today

కీలక ఆటగాళ్ల సేవలు కోల్పోయిన భారత జట్టు.. శుక్రవారం నుంచి జరిగే ఐదో టెస్టులో ఇంగ్లండ్ తో అమీతుమీ తేల్చుకోనుంది. గతేడాది ఐదు టెస్టుల సిరీస్‌లో వాయిదా పడ్డ ఈ  టెస్టులో నెగ్గి, కనీసం డ్రా చేసుకొని సిరీస్‌ చేజిక్కించుకోవాలని భావిస్తోంది. రోహిత్‌ శర్మ కరోనా పాజిటివ్‌గా తేలి ఈ మ్యాచ్‌కు దూరంగా ఉన్నాడు. గురువారం ఉదయం చేసిన టెస్టులోనూ పాజిటివ్ గా తేలడంతో అతను మ్యాచ్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. మరో గాయం కారణంగా వైస్‌ కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ జట్టుకు దూరమయ్యాడు. రోహిత్‌ గైర్హాజరీలో బుమ్రా టెస్టు టీమ్‌కు 36వ కెప్టెన్‌ అయ్యాడు. కపిల్‌ దేవ్‌ తర్వాత టెస్టు కెప్టెన్సీ అందుకున్న పేసర్‌గా ఘనత వహించాడు. 
  
 తొమ్మిది నెలల కిందట ఆడిన నాలుగు టెస్టుల తర్వాత భారత్ 2–1తో ఆధిక్యంలో నిలిచింది. నాడు భారత జట్టులో పలువురు కరోనా బారిన పడటంతో ఆఖరి టెస్టును వాయిదా వేశారు. ఇన్నాళ్లకు ఈ మ్యాచ్ జరుగుతోంది. అయితే ఈ తొమ్మిది నెలల కాలంలో ఇరు జట్లలో అనేక మార్పులు జరిగాయి. రవిశాస్త్రి స్థానంలో ద్రవిడ్ కోచ్ గా వచ్చాడు. విరాట్ కోహ్లీ టెస్టు కెప్టెన్సీ కోల్పోయాడు. అతని నుంచి పగ్గాలు అందుకున్న రోహిత్ కరోనాతో ఈ మ్యాచుకు దూరం అవగా.. కెప్టెన్సీ బుమ్రాను వరించింది. బుమ్రాకు సారథ్యం కొత్త. అత్యంత కీలకమైన మ్యాచ్‌లో అతను జట్టును ఎలా నడిపిస్తాడన్నది ఆసక్తిగా మారింది. 
 
మరోవైపు ఈ మ్యాచ్ నెగ్గి 2–2తో సిరీస్‌ పంచుకోవాలని ఆతిథ్య జట్టు కృత నిశ్చయంతో ఉంది. గతేడాది నాలుగు టెస్టుల్లో నిరాశ ఇంగ్లండ్‌ ఇప్పుడూ పూర్తిగా మారి సరికొత్తగా కనిపిస్తోంది. రూట్ నుంచి కెప్టెన్సీ అందుకున్న బెన్ స్టోక్స్ సారథ్యం, కొత్త కోచ్ బ్రెండన్ మెకల్లమ్ మార్గనిర్దేశంలో ఆ జట్టు ఆట మారింది. పైగా, ఈ మధ్యే ప్రపంచ  టెస్టు చాంపియన్ న్యూజిలాండ్‌ను మూడు టెస్టుల్లోనూ చిత్తు చేసి ఫుల్‌ జోష్‌లో ఉంది. రూట్‌ వరుస సెంచరీలు కొడుతూ కెరీర్‌ బెస్ట్‌ ఫామ్‌లో ఉన్నాడు. అలాంటి ఇంగ్లండ్ జోరును భారత్ అడ్డుకుంటుందో లేదో చూడాలి. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 3 నుంచి ప్రారంభం అవుతుంది.

More Telugu News