Andhra Pradesh: ఏపీలో మ‌రోమారు డీజిల్ సెస్ పెంపు...రేప‌టి నుంచి పెర‌గ‌నున్న ఆర్టీసీ చార్జీలు

  • డీజిల్ సెస్ పెంపు నుంచి సిటీ బ‌స్సుల‌కు మిన‌హాయింపు
  • అత్య‌ల్పంగా రూ.5, అత్య‌ధికంగా రూ.80 మేర పెర‌గ‌నున్న డీజిల్ సెస్‌
  • ఏపీ నుంచి హైద‌రాబాద్ వెళ్లే బ‌స్సుల్లో భారీగా పెరిగిన డీజిల్ సెస్‌
  • ప‌ల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్‌, సూప‌ర్ ల‌గ్జ‌రీల్లో కొంత దూరం వ‌ర‌కు పెర‌గ‌ని చార్జీలు
ap government hikes diesel cess in apsrtc buses

ఏపీలో మ‌రోమారు ఆర్టీసీ చార్జీలు పెర‌గ‌నున్నాయి. ఈ మేర‌కు గురువారం రాష్ట్ర ప్ర‌భుత్వం ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. ప్ర‌స్తుతం ఆర్టీసీ బ‌స్సుల్లో ప్ర‌యాణ చార్జీకి అద‌న‌గా డీజిల్ సెస్ పేరిట కొంత మొత్తాన్ని వ‌సూలు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. తాజాగా ప్ర‌యాణ దూరాన్ని ఆధారంగా చేసుకుని చార్జీల‌ను పెంచ‌కున్నా... డీజిల్ సెస్‌ను దూరాన్ని బ‌ట్టి పెంచుతూ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఫ‌లితంగా ప్ర‌యాణ చార్జీలు పెర‌గ‌కున్నా... డీజిల్ సెస్ పెంపుతో మొత్తంగా చార్జీలు పెర‌గ‌నున్నాయి. పెంచిన డీజిల్ సెస్ ను శుక్ర‌వారం నుంచే అమ‌లు చేయ‌నున్న‌ట్లు ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. 

డీజిల్ సెస్ తాజా పెంపు బ‌స్సు రకాన్ని బ‌ట్టి, దూరాన్ని బ‌ట్టి వేర్వేరుగా ఉండ‌నుంది. ప‌ల్లె వెలుగు బ‌స్సుల్లో క‌నీస చార్జీ ప్ర‌స్తుతం రూ.10గా ఉంది. 30 కిలో మీట‌ర్ల వ‌ర‌కు ప‌ల్లె వెలుగులో డీజిల్ సెస్ పెంపు ఉండ‌దు. 30 నుంచి 60 కిలో మీట‌ర్ల వ‌ర‌కు ప్ర‌స్తుతం వ‌సూలు చేస్తున్న డీజిల్ సెస్‌కు అద‌నంగా మ‌రో రూ.5 వ‌సూలు చేయ‌నున్నారు. ఈ బ‌స్సుల్లో 60 నుంచి 70 కిలో మీట‌ర్ల వ‌ర‌కు అద‌నంగా రూ.10 వ‌సూలు చేయ‌నున్నారు.

ఇక ఎక్స్‌ప్రెస్‌, మెట్రో ఎక్స్‌ప్రెస్‌, మెట్రో డీల‌క్స్ బ‌స్సుల్లో డీజిల్ సెస్ పేరిట రూ.5 వ‌సూలు చేస్తున్నారు. సిటీ బ‌స్సుల్లో డీజిల్ సెస్‌ను పెంచ‌డం లేద‌ని ప్రభుత్వం తెలిపింది. ఎక్స్‌ప్రెస్ బ‌స్సుల్లో 30 కిలో మీట‌ర్ల దాకా డీజిల్ సెస్ పెంపు లేదు. 31 నుంచి 65 కిలో మీట‌ర్ల వ‌ర‌కు అద‌నంగా రూ5 వ‌సూలు చేయ‌నున్నారు. ఈ బ‌స్సుల్లో 60 నుంచి 80 కిలో మీట‌ర్ల వ‌ర‌కు అద‌నంగా రూ.10 వసూలు చేయ‌నున్నారు. 

ఇక దూర ప్రాంతాల‌కు తిరిగే సూప‌ర్ ల‌గ్జ‌రీ, ఏసీ బ‌స్సుల్లో ప్ర‌స్తుతం డీజిల్ సెస్ పేరిట రూ.10 మాత్ర‌మే వ‌సూలు చేస్తున్నారు. సూప‌ర్ ల‌గ్జ‌రీ బ‌స్సుల్లో 55 కిలో మీట‌ర్ల దాకా డీజిల్ సెస్‌ను పెంచ‌లేదు. హైద‌రాబాద్‌కు వెళ్లే సూప‌ర్ ల‌గ్జరీ బ‌స్సుల్లో ఇక‌పై డీజిల్ సెస్ కింద రూ.70 వ‌సూలు చేయ‌నున్నారు. ఇక హైద‌రాబాద్ వెళ్లే అమ‌రావ‌తి బస్సుల్లో ఇక‌పై డీజిల్ సెస్ పేరిట రూ.80 వ‌సూలు చేయ‌నున్నారు.

More Telugu News