‘ఇగో’ స్టోరీతో వస్తున్న రాజశేఖర్ కూతురు శివాని

30-06-2022 Thu 12:42
  • రాహుల్ విజయ్ సరసన హీరోయిన్ గా కొత్త చిత్రం ప్రారంభం
  • ‘తెల్లవారితే గురువారం’ ఫేమ్ మణికాంత్ దర్శకత్వం
  • పెళ్లయిన కొత్త జంట మధ్య వచ్చే విభేదాల చుట్టూ కథ 
Shivani rajashekars new film with ego story
రాజశేఖర్, జీవిత దంపతుల వారసురాలిగా టాలీవుడ్ లో అడుగు పెట్టిన శివాని ఇప్పుడిప్పుడే పేరు తెచ్చుకుంటోంది. ‘అద్భుతం’, ‘డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు’ చిత్రాల్లో హీరోయిన్‌గా నటించిన ఆమె ఇటీవల తండ్రి రాజశేఖర్‌‌తో కలిసి ‘శేఖర్‌‌’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ, ఆ చిత్రం అంతగా ఆడలేదు. ఒక పక్క తెలుగులో నిరూపించుకునే ప్రయత్నం చేస్తూనే మరోవైపు తమిళంలో కూడా ఆమె సినియాలు చేస్తోంది. తమిళంలో ఆమె నటించిన రెండు సినిమాలు విడుదలయ్యాయి. 

 శివాని హీరోయిన్ గా నటిస్తున్న మరో సినిమా మొదలైంది. ‘తెల్లవారితే గురువారం’ ఫేమ్ మణికాంత్ గెల్లి దర్శకత్వం వహిస్తున్నఈ చిత్రంలో రాహుల్‌ విజయ్‌ సరసన శివాని హీరోయిన్. ఎటర్నిటీ ఎంటర్‌‌టైన్మెంట్‌ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. పూజా కార్యక్రమాలతో ఈ సినిమాని ఈ మధ్యే ప్రారంభించారు. పెళ్లి చుట్టూ నడిచే ఈ కథలో శివాని, రాహుల్ విజయ్ జంటగా కనిపించనున్నారు. కొత్తగా పెళ్లయిన జంట మధ్య ‘ఇగో’వల్ల వచ్చే విభేదాలే ప్రధాన కాన్సెప్ట్ అని తెలుస్తోంది.  

 ఈ చిత్రానికి ఇంకా పేరు ఖరారు చేయలేదు. ‘లాంగ్ లాంగ్ ఇగో స్టోరీ’ అనే పేరుతో సినిమాను ప్రమోట్ చేస్తున్నారు. జులై 6 నుండి రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టాలని చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది. ఈ చిత్రానికి కల్యాణి మాలిక్‌ సంగీతం అందిస్తున్నాడు.