ఇక ఆపండి.. నేను పెళ్లి చేసుకోవడం లేదని ఫ్యామిలీ, ఫ్రెండ్స్ ​ని కన్విన్స్​ చేయాల్సి వచ్చింది: హీరో రామ్

30-06-2022 Thu 08:27
  • రామ్ పెళ్లి పై కొన్ని రోజులుగా సోషల్ మీడియా లో పుకార్లు
  • హైస్కూల్లో ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకుంటాడని వార్తలు
  • అవన్నీ పుకార్లే అని స్పష్టం చేసిన రామ్
Ram Pothineni refutes rumours of getting married
సినీ పరిశ్రమలో నటీనటులను ప్రేక్షకులు చాలా అభిమానిస్తారు. కొందరైతే వాళ్లను ఆరాధిస్తారు. తమ అభిమాన హీరో, హీరోయిన్ల వ్యక్తిగత విషయాలను కూడా తెలుసుకోవడానికి ఎంతో ఆసక్తి చూపిస్తుంటారు. ఇప్పుడు సోషల్ మీడియా విస్తృతి పెరగడంతో సినీ ఇండస్ట్రీ వాళ్లకు సంబంధించిన ఏ విషయమైనా క్షణాల్లో వైరల్ అయిపోతుంది. ఆ విషయం నిజమా, అబద్ధమా? అన్నది అభిమానులకు అనవసరం. తమకు ఏ వార్త తెలిసినా దాన్ని పది మందితో పంచుకోవడానికి ఇష్టపడతారు. ఆ వార్త నిజమైతే సమస్య లేదు కానీ, కాకపోతే మాత్రం కొత్త సమస్య వస్తుంది. సెలబ్రిటీలకు తలనొప్పి తెచ్చి పెడుతుంది. తెలుగు హీరో రామ్ పోతినేనికి ఇప్పుడు ఇలాంటి తలనొప్పే ఎదురైంది. 

 రామ్ కొత్త సినిమా ‘వారియర్’ కంటే కూడా అతని వ్యక్తిగత జీవితం గురించి అభిమానులు తెగ ఆసక్తి చూపిస్తున్నారు. ఎందుకంటే రామ్ పెళ్లి చేసుకోబోతున్నాడంటూ కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. హైస్కూల్ చదివే రోజుల నుంచి తను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాడని, ఆమెనే పెళ్లి చేసుకోనున్నాడని కొన్నాళ్లుగా సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. తన పెళ్లి విషయాన్ని రామ్ అతి త్వరలోనే అందరితో పంచుకుంటాడని ప్రచారం జరుగుతోంది. పెళ్లి కూతురు ఈమెనే అంటూ  కూడా వార్తలు వచ్చాయి. 
    
 ఈ క్రమంలో తన పెళ్లి విషయంలో వస్తున్న వార్తలపై రామ్ స్పందించాడు. తానిప్పుడు పెళ్లి చేసుకోవడం లేదని స్పష్టం చేశాడు. ఈ విషయంలో వస్తున్న వార్తలన్నీ పుకార్లే అని కొట్టిపారేశాడు. ‘ఓరి దేవుడా.. ఇక ఆపండి’ అంటూ ట్వీట్ చేశాడు. తాను ఏ రహస్య ప్రేమికురాలిని పెళ్లి చేసుకోవడం లేదని ఫ్యామిలీని, ఫ్రెండ్స్‌ని కన్విన్స్ చేయాల్సిన పరిస్థితి వచ్చిందని వాపోయాడు. నిజం చెప్పాలంటే..తాను హైస్కూల్‌కి వెళ్లిందే తక్కువ అని ట్వీట్ చేశాడు. దాంతో ఇన్ని రోజులుగా రామ్ పెళ్లి గురించి విన్నవన్నీ తప్పుడు వార్తలేనని తేలిపోయింది.