అనకాపల్లి జిల్లాలో రాయల్ బెంగాల్ టైగర్ సంచారం.. జీడితోటలో గేదెను చంపితిన్నట్లు గుర్తింపు

30-06-2022 Thu 07:21
  • టి.జగ్గంపేట సమీపంలో సంచారం
  • పాదముద్రలను బట్టి రాయల్ బెంగాల్ టైగర్‌గా గుర్తింపు
  • 30 కిలోమీటర్ల పరిధిలో సంచరించే అవకాశం ఉందన్న అధికారులు
  • ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక
Royal Bengal Tiger roaming around Anakapalle dist
అనకాపల్లి జిల్లాలో పెద్దపులి సంచారం ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోంది. కోటవురట్ల మండలం టి.జగ్గంపేట సమీపంలోని జీడిమామిడి తోటలో దాని పాదముద్రలను గుర్తించారు. అలాగే, శ్రీరాంపురం సమీపంలోని జీడితోటలో గేదెను కూడా అది చంపి తిన్నట్టు అధికారులు గుర్తించారు. సమాచారం అందుకున్న వెంటనే జీడిమామిడి తోటకు వచ్చిన అటవీ అధికారులు పాదముద్రలను పరిశీలించి దానిని రాయల్ బెంగాల్ టైగర్‌గా గుర్తించారు.

గేదెను చంపితిన్న అనంతరం అది కొండపైకి వెళ్లిపోయిందని, మళ్లీ తిరిగి వచ్చే అవకాశం ఉందన్నారు. దాని సంచారం గురించి తెలుసుకునేందుకు చుట్టుపక్కల ప్రాంతాల్లో కెమెరాలు ఏర్పాటు చేశారు. ఆ పులి 30 కిలోమీటర్ల పరిధిలో సంచరించే అవకాశం ఉందని, కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కాగా, గత కొద్దికాలంగా తూర్పుగోదావరి పరిసరాల్లో సంచరిస్తున్న పులే ఇటు వచ్చి ఉంటుందని భావిస్తున్నారు.