మోదీ పర్యటన నేపథ్యంలో హైదరాబాద్‌లో 144 సెక్షన్

30-06-2022 Thu 06:58
  • జులై 2, 3 తేదీల్లో నగరంలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు
  • హాజరు కానున్న ప్రధాని మోదీ
  • మూడు కమిషనరేట్ల పరిధిలో 144 సెక్షన్ విధింపు
  • నేటి ఉదయం 6 గంటల నుంచి జులై 4 సాయంత్రం వరకు ఆంక్షలు
heavy security in hyderabad amid modi tour on july 2nd 3rd
జులై రెండు, మూడు తేదీల్లో హైదరాబాద్‌లో జరగనున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ హాజరు కానున్నారు. ప్రధాని పర్యటన సందర్భంగా పోలీసులు నగరంలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. మూడు కమిషనరేట్ల పరిధిలో 144 సెక్షన్ విధించడంతోపాటు నో ఫ్లయింగ్ జోన్స్‌ను ప్రకటించారు. నేటి ఉదయం 6 గంటల నుంచి జులై 4న సాయంత్రం ఆరు గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయి.

హైదరాబాద్ పరిధిలోని పరేడ్‌గ్రౌండ్స్, రాజ్‌భవన్, పరిసరాలతోపాటు సైబరాబాద్ పరిధిలోని నొవాటెల్ వరకు ఫ్లయింగ్ జోన్‌ను ప్రకటించగా, డ్రోన్లు, రిమోట్ కంట్రోల్డ్ డ్రోన్లు, మైక్రోలైట్ ఎయిర్‌క్రాఫ్ట్స్‌పై నిషేధం విధించారు. ఆంక్షలను ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.